అయ్యప్ప స్వాములు అలా చేస్తే రూ. 5,000 ఫైన్: కట్టకపోతే.. !!
ప్రసిద్ధ పుణ్యక్షేత్ర శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులకు కేరళలోని పథనంథిట్ట జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. పవిత్ర పంబా నదిలో పాత దుస్తులు విసిరేయడం, ప్లాస్టిక్ తో పాటు ఇతర చెత్తా చెదారాన్ని పారవేసి నదిని కలుషితం చేయడంపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారికి అక్కడికక్కడే గరిష్టంగా రూ. 5,000 వరకు జరిమానా విధిస్తామని అధికారులు ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ నూతన నిబంధనల ప్రకారం.. జరిమానా పడిన అయ్యప్పస్వాములు గానీ, సాధారణ వ్యక్తులు గానీ 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించకపోతే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 163, కేరళ పంచాయతీ రాజ్ యాక్ట్ 1994 లోని నిబంధనల ఆధారంగా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి జనవరి వరకు జరిగే పవిత్ర మండలం-మకరవిళక్కు యాత్రా కాలంలో దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం శబరిమలకు తరలివస్తుంటారు. ఇరుముడి ధరించి కొండపైకి వెళ్లే క్రమంలో పవిత్ర పంబా నదిలో స్నానం చేయడం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆచారం. స్నానమాచరించిన అనంతరం యాత్రీకులు తాము ధరించిన తడి దుస్తులను నదిలోనే వదిలేసి వెళ్తుండటం పర్యావరణ సమస్యగా మారింది.
జిల్లా యంత్రాంగం లెక్కల ప్రకారం.. యాత్రా కాలంలో ప్రతిరోజూ పంబా నదిలోకి టన్నుల కొద్దీ పాత గుడ్డలు, వ్యర్థాలు వచ్చి చేరుతున్నాయి. ధార్మిక విశ్వాసాల పేరుతో నదిని కలుషితం చేసే ఈ అలవాటును అరికట్టడానికే కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నదీ ప్రవాహం మందగించడంతో పాటు నీరు దుర్గంధభరితంగా మారడానికి ఈ వ్యర్థాలే కారణమని చెబుతోంది.
శబరిమల యాత్రకు వచ్చే భక్తులు స్వామివారి దర్శనానికే పరిమితం కాకుండా, పరిసరాల పరిశుభ్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఈ నిబంధనలను పటిష్టంగా అమలు చేసేందుకు పంబా తీరంలో ప్రత్యేక బృందాలను దించారు. నిబంధనలు అతిక్రమించే వారిని గుర్తించి తక్షణమే జరిమానా విధించేలా చర్యలు చేపట్టారు. నది పరిసరాల్లో చెత్త వేయకుండా ప్రత్యేక చెత్తబుట్టలు, బట్టలు సేకరించే కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.
పంబా నదిలో పెరుగుతున్న కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీషన్.. ఎక్స్ వేదికగా భక్తులకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. శబరిమల ధామం, పంబా నది పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని గుర్తు చేశారు. భావి తరాల కోసం ఈ పవిత్ర నదిని శుభ్రంగా ఉంచాలని, నీటిలో బట్టలు, ప్లాస్టిక్ లేదా ఇతర వ్యర్థాలను వేయవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఆంగ్ల భాషల్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు.













Click it and Unblock the Notifications
