మద్యం అలవాటు ఉన్న పోలీసులకు నో శబరిమల డ్యూటీ
శబరిమల అయ్యప్ప మండలం- మకరవిళక్కు యాత్రా కాలం ప్రారంభమైంది. ఈ నెల 17వ తేదీన వేకువజామున 3 గంటలకు ప్రత్యేక పూజలతో ఆలయం తలుపులను తెరిచారు. సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తోన్నారు. డిసెంబర్ 27వ తేదీ వరకు మండలం- ఆ తర్వాత 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మకరవిళక్కు సీజన్ కొనసాగనుంది. ఈ యాత్రా కాలం ఆరంభం కావడంతో కేరళ పతనంతిట్ట కొండల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ యాత్రా కాలంలో భక్తుల రక్షణ, భద్రత లక్ష్యంగా కేరళ పోలీస్ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. శబరిమల బందోబస్తు విధుల్లో పాల్గొనే పోలీసుల ఎంపికపై సౌత్ జోన్ ఐజీ ప్రకాష్ కీలక నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై మద్యం అలవాటు ఉన్నవారికి, వివాదాస్పద నేపథ్యం గానీ, క్రమశిక్షణా రాహిత్యం ఉన్న కానిస్టేబుళ్లు, ఎస్ఐలకు శబరిమల విధులు కేటాయించవద్దని జిల్లా ఎస్పీలు, బెటాలియన్ కమాండెంట్లకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు.

ఈ నెల 20న నీలక్కల్ బేస్ క్యాంప్ వద్ద ప్రశాంత్ అనే ఓ డ్రైవర్ పై అక్కడ డ్యూటీలో ఉన్న జిజో అనే ఎఎస్ఐ కొట్టిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్కింట్ విషయంలో తలెత్తిన చిన్న వివాదంతో చిలికి చిలికి గాలీవానగా మారింది. అకారణంగా జిజో తనను కొట్టాడని, ఆ సమయంలో ఆయన మద్యం మత్తులో ఉన్నాడంటూ ప్రశాంత్ నార్త్ పరవూర్ పోలీస్ స్టేషన్ లో లిఖితపూరకంగా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పోలీసులు జిజోపై చర్యలు తీసుకున్నారు. అతన్ని సస్పెండ్ చేశారు.
ఈ ఘటన పోలీస్ శాఖ ప్రతిష్టను దెబ్బతీసిందని కేరళ పోలీస్ శాఖ భావించింది. ఇకపై క్రమశిక్షణ కలిగిన శబరిమల యాత్రా వ్యవస్థలో ఇలాంటి ప్రవర్తనను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. ఇటువంటి ఘటనలను సహించేది లేదని ఐజీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భక్తుల సేవ కోసం కేటాయించిన బందోబస్తులో సిబ్బంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్ల వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని ఐజీ ఆందోళన వ్యక్తం చేశారు.
రాబోయే వివిధ విడతల శబరిమల బందోబస్తు కోసం పోలీసులను ఎంపిక చేసే సమయంలో వారి గత చరిత్రను క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని జిల్లాల ఎస్పీలు, బెటాలియన్ కమాండెంట్లను ఆదేశించారు. సత్ప్రవర్తన, అంకితభావం, క్రమశిక్షణ కలిగిన అధికారులను మాత్రమే శబరిమల విధులకు పంపాలని స్పష్టం చేశారు. ఐజీ జారీ చేసిన ఈ ఆదేశాలను ఆయా యూనిట్ అధిపతులు కచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులైన ఉన్నతాధికారులపై కూడా తీవ్రమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
