తెలంగాణకు మరో డిప్యూటీ సీఎం - ఆయనకే ఛాన్స్..!?
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న సమయంలో కొత్త వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. పార్టీ అధినాయకత్వం తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అటు బీజేపీ, బీఆర్ఎస్ అమలు చేస్తున్న వ్యూహాలకు ధీటుగా ప్రణాళికలు రచిస్తోంది. సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా మరో డిప్యూటీ సీఎం పదవి తెర మీదకు రావటంతో.. తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభుత్వం.. పార్టీలో కీలక మార్పులు చేసేందుకు సిద్దం అవుతోంది. ఈ మేరకు కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుత కేబినెట్ తో పాటుగా పార్టీ పదవుల్లోనూ మార్పులు అవసరమని గుర్తించింది. 2028 ఎన్నికలే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న మంత్రివర్గంలో ఇద్దరి పైన వేటు ఖాయమని ప్రచారం జరుగు తోంది. అదే విధంగా కొండా సురేఖ రాజీనామా తో ఖాళీ ఉన్న స్థానాన్ని భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. త్వరలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పూర్తయిన తరువాత కేబినెట్ ప్రక్షాళన చేపట్టనున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కానున్న ఒక మహిళకు కేబినెట్ లో చోటు కల్పిస్తారని తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న మల్లు భట్టి విక్రమార్కతో పాటు, వెనుకబడిన తరగతుల (బీసీ) సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు అదనంగా మరో డిప్యూటీ సీఎం పదవి కేటాయించనున్నట్లు పార్టీ నేతల సమాచారం.

హైకమాండ్ నిర్ణయం పై ఉత్కంఠ
అటు బీజేపీ బీసీలకు ప్రాధాన్యత నినాదం బలంగా వినిపిస్తోంది. ఈ సమయంలో రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో మరింత కీలక వాటా దక్కాలనే డిమాండ్ కాంగ్రెస్ లోనూ మొదలైంది. ఇప్పటికే ఈ అంశం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త సమీకరణాల దిశగా చర్చకు కారణమయ్యాయి. ప్రభుత్వం ఏర్పాటు సమయంలో రేవంత్ కు సీఎంగా ప్రకటించిన వేళ భట్టికి ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒకటే డిప్యూటీ సీఎం పదవి ప్రకటించారు. అయితే, మారుతున్న సమీకరణాలతో బీసీ డిప్యూటీ సీఎం ఇవ్వాలని భావిస్తున్నారు. దీంతో, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్ పేర్లు ఈ పదవి కోసం పరిశీలనలో ఉన్నట్లు చెబుతున్నారు. డిసెంబర్ 7వ తేదీ తరువాత మరో డిప్యూటీ సీఎం పదవి.. మంత్రివర్గ ప్రక్షాళన పైన స్పష్టత రానుంది.













Click it and Unblock the Notifications
