ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో మరో సంచలనం.. ఒక్క ఛార్జ్‌తో 500 కిలోమీటర్లకు పైగా రేంజ్!
MG Windsor EV 2027: ఇండియాలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు ఎంజీ విండ్సర్ ఈవీకి ఇప్పటివరకు లేని విధంగా క్రేజీ అప్‌డేట్ రానుంది. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2027లో విండ్సర్ ఈవీ ఫేస్ లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త అప్‌డేట్‌లో ప్రధాన ఆకర్షణ 61 kwh కెపాసిటీ గల పెద్ద బ్యాటరీ ప్యాక్. ఇది ప్రస్తుత మోడళ్ల కంటే చాలా ఎక్కువ డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. 2024లో లాంచ్ అయిన ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ అతి తక్కువ సమయంలోనే బ్రాండ్ కు బెస్ట్ సెల్లింగ్ మోడల్ గా నిలవడమే కాకుండా.. 2026లో 80,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటింది. మార్కెట్లోకి వచ్చి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సరికొత్త ఎక్స్‌టీరియర్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, అదనపు రేంజ్‌తో కంపెనీ దీనిని తీసుకురాబోతోంది.
500 కిలోమీటర్లకు పైగా రేంజ్
రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్‌లో అతిపెద్ద మార్పు దాని బ్యాటరీ ప్యాక్‌లోనే కనిపించనుంది. ప్రస్తుతం ఈ కారు 38 kwh, 52.9 Kwh అనే రెండు బ్యాటరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. వీటి ARAI సర్టిఫైడ్ రేంజ్ సింగిల్ ఛార్జ్ పై వరుసగా 332 కిలోమీటర్లు, 449 కిలోమీటర్లుగా ఉంది. అయితే వచ్చే ఏడాది రానున్న 2027 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 61kwh బ్యాటరీ ప్యాక్‌ను అందించే అవకాశం ఉంది. దీనివల్ల హైవేలపై సుదూర ప్రయాణాలు చేసే కస్టమర్లకు రేంజ్ ఆందోళన చాలా వరకు తగ్గనుంది. ప్రస్తుత మోడల్ తరహాలోనే కొత్త మోడల్‌లో కూడా ఫ్రంట్-యాక్సిల్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ కొనసాగనుంది. అయితే దీని పవర్, టార్క్ గణాంకాలలో ఏమైనా మార్పులు ఉంటాయా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

80,000 యూనిట్లకు పైగా విక్రయాల రికార్డు
2024లో ఎంజీ విండ్సర్ ఈవీని లాంచ్ చేసినప్పుడు కేవలం 38 kwh బ్యాటరీ ప్యాక్‌తో మాత్రమే తీసుకువచ్చారు. కస్టమర్ల నుంచి వచ్చిన అద్భుతమైన స్పందన, డిమాండ్ దృష్ట్యా 2025లో కంపెనీ పెద్దదైన 52.9kwh బ్యాటరీ ప్యాక్‌ను అందించింది. . దీని దన్నుతో అదే ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచి 2026లో 80,000 యూనిట్ల అమ్మకాలను దాటేసింది. ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ మార్కెట్లోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నందున పెరుగుతున్న పోటీ మధ్య తన ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ఈ మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ ఎంతో కీలకంగా మారనుంది.
ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్లలో భారీ మార్పులు
పెద్ద బ్యాటరీతో పాటు రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ ఫేస్‌లిఫ్ట్ ఎక్స్ టీరియర్ డిజైన్, క్యాబిన్లో కూడా పలు కీలక మార్పులు, కొత్త ఫీచర్లు జోడించే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు భారత రోడ్లపై దీని టెస్టింగ్ వాహనం ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా ఈ కారు ఆధారపడిన గ్లోబల్ మోడల్ వులింగ్ క్లౌడ్ ఈవీకి కూడా అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటివరకు పెద్దగా ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో భారతీయ మార్కెట్ కోసం ఎంజీ ఇండియా దీని స్టైలింగ్, క్యాబిన్ లేఅవుట్ లో ఎలాంటి మార్పులు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
అంచనా ధర, మార్కెట్లో పోటీ
కొత్త ఫీచర్లు, మారిన డిజైన్, పెద్ద 61 kwh బ్యాటరీ ప్యాక్ కారణంగా రాబోయే ఎంజీ విండ్సర్ ఈవీ ధర ప్రస్తుత మోడల్ కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం విండ్సర్ ఈవీ ఎక్స్-షోరూం ధర రూ.14.85 లక్షల నుంచి రూ.19.15 లక్షల మధ్య ఉంది. తన విశాలమైన క్రాసోవర్ లేఅవుట్ కారణంగా మార్కెట్లో దీనికి నేరుగా పోటీ ఇచ్చే కార్లు లేనప్పటికీ.. ధర పరంగా టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో ఈవీ, కియా సిరోస్ ఈవీ వంటి కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు ఇది బలమైన ప్రత్యామ్నాయంగా కొనసాగనుంది.














Click it and Unblock the Notifications
