ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కార్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాల అధికారిక కార్ల విషయంలో ఆర్థిక శాఖ కీలక సవరణలు చేసింది. ఇప్పటి నుంచి ప్రభుత్వ అధికారులకు కేటాయించే స్టాఫ్ కార్ల కొనుగోలులో ఎలక్ట్రిక్ వాహనాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు గరిష్ట ధర పరిమితిని ఏకంగా రూ.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ధరల పరిమితి పెంపు
కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ (వ్యయ విభాగం) విడుదల చేసిన అధికారిక కార్యాలయ మెమోరాండం ప్రకారం.. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ వంటి సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్(ఐసీఈ) వాహనాల కొనుగోలు ధర పరిమితి రూ.10 లక్షలుగానే కొనసాగనుంది. కానీ సాంకేతికంగా మెరుగైన ఎలక్ట్రిక్ వాహనాలను సేకరించడానికి వీలుగా వాటి నెట్ డీలర్ ధర పరిమితిని మాత్రం రూ.20 లక్షలకు పెంచారు.దేశంలో ముడిచమురు దిగుమతులను తగ్గించడం, సున్నా కర్బన ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

మినహాయింపులు కావాలంటే కఠిన నిబంధనలు
ప్రభుత్వ శాఖల్లో పాత కార్ల స్థానంలో కొత్న వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకే మొదటి ఓటు వేయాలి. కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు కాకుండా పెట్రోల్, డీజిల్ లేదా హైబ్రిడ్ కార్లను కొనుగోలు చేయాలనుకుంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరి. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వీలుపడని లేదా అసాధ్యమైన పరిస్థితుల్లో తగిన కారణాలు చూపుతూ ప్రణాళికను సిద్దం చేయాలి. సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా విభాగపు కార్యదర్శి ఆమోదం, ఫైనాన్షియల్ అడ్వైజర్ సమ్మతి పొందిన తర్వాత మాత్రమే ఈ ప్రతిపాదనలను డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండించర్‌కు పంపాలి. అక్కడ ప్రత్యేక మినహాయింపు లభిస్తేనే సాంప్రదాయ కార్ల కొనుగోలుకు వీలవుతుంది.
అద్దె వాహనాలకూ ఈవీ నిబంధన వర్తింపు
ప్రభుత్వ కార్యాలయాల అవసరాల కోసం అద్దెకు తీసుకునే వాహనాల విషయంలో 2022 సెప్టెంబర్ 1న జారీ చేసిన మార్గదర్శకాలే నిరంతరాయంగా అమలులో ఉంటాయని స్పష్టం చేశారు. అద్దె వాహనాల్లో కూడా ఎలక్ట్రిక్ కార్లకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కొత్త మార్గదర్శకాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఆర్థిక శాఖ స్ఫష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో ఈవీ విప్లవానికి మరింత ఊతాన్నిస్తుందని ఆటో నిపుణులు భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications
