భారత్ విషయంలో పాక్ డబుల్ గేమ్.. అఫ్గాన్లు బయటపెట్టిన అసలు రంగు!
పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోసారి అంతర్జాతీయ స్థాయిలో బట్టబయలైంది. పాకిస్థాన్ వాతావరణ శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ తాజాగా భారత పర్యటనకు రావడంపై అఫ్గానిస్తాన్ పౌరులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. గతేడాది అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఇండియాలో పర్యటించినప్పుడు ఆయనను భారత గూఢచారి అని నిందించిన పాకిస్థాన్.. ఇప్పుడు తమ మంత్రి ఢిల్లీకి వెళ్తే మాత్రం దాన్ని దౌత్యం అని సమర్థించుకోవడంపై అఫ్గాన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
సింధు జలాలపై బెదిరింపులు చేసిన నేతనే ఢిల్లీకి పంపిన షెహబాజ్!
ఢిల్లీలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సివిలైజేషనల్ డైలాగ్ ఫోరమ్ తొలి ఎడిషన్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ మంత్రి ముసాదిక్ మాలిక్ ఇండియాకు వచ్చారు. భారత్-పాకిస్థాన్ మధ్య సంబంధాలు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గతంలో సింధు జలాల ఒప్పందం విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయాలపై 'చేతులు నరికేస్తాం' అంటూ వివాదాస్పద, రెచ్చగొట్టే కామెంట్స్ చేసిన ముసాదిక్ మాలిక్‌నే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ సదస్సుకు పంపడం గమనార్హం. దీన్ని బట్టి ఇండియాతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాలనే ఉద్దేశం పాకిస్థాన్ కు ఏ మాత్రం లేదని స్పష్టమవుతోంది.

పాక్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన అఫ్గాన్లు
పాక్ మంత్రి ఢిల్లీ పర్యటనపై అఫ్గానిస్థాన్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ బుర్హాన్ ఉద్దీన్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. "అఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి ఇండియాకు వెళ్తే ఆయనను భారత గూఢచారి అని ముద్ర వేస్తారు.. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తారు. కానీ పాకిస్తాన్ మంత్రి ఇండియాకు వెళ్తే మాత్రం దాన్ని గొప్ప దౌత్యనీతి అని పిలుస్తారు. ఇదెక్కడి ద్వంద్వ ప్రమాణం?" అంటూ బుర్హాన్ ఉద్దీన్ ప్రశ్నించారు.
అక్టోబర్ 2025లో ఏం జరిగిందంటే?
గతేడాది అక్టోబరులో అఫ్గానిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఢిల్లీలో పర్యటించినప్పుడు పాకిస్తాన్ తీవ్ర అక్కసును వెళ్లగక్కింది. అప్పట్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందిస్తూ.. "అఫ్గానిస్తాన్ ఎప్పుడూ భారత్ వైపే మొగ్గు చూపుతుంది. నిన్న, నేడు, రేపు కూడా పాకిస్తాన్ కు వ్యతిరేకంగానే ఉంటుంది" అంటూ ఆరోపించారు. అంతేకాకుండా పాక్ మీడియా, సోషల్ మీడియాలో ముత్తాకీని భారత ఏజెంట్ గా అభివర్ణిస్తూ విష ప్రచారం చేశాయి. ఇప్పుడు అదే భారత గడ్డపై పాక్ మంత్రి అడుగుపెట్టడంతో అఫ్గాన్లు పాక్ అసలు రంగును బయటపెడుతూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు.














Click it and Unblock the Notifications
