నూడుల్స్ తిన్న వెంటనే ఏడేళ్ల బాలిక స్పాట్ డెడ్.. ఏం జరిగిందంటే..?
చిన్న పిల్లలు జంక్ ఫుడ్ ను ఇష్టంగా తింటుంటారు. పేరెంట్స్ తో బయటకు వెళ్తే తినుబండారాలను కొనివ్వమని అడుగుతుంటారు. ఇక చాక్లెట్లు.. బిస్కెట్లతో పాటు నూడుల్స్ ను కూడా తినేందుకు పిల్లలు ఇష్టపడుతుంటారు. అయితే తాజాగా రాజస్థాన్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంట్లో చేసిన నూడుల్స్ తిన్న వెంటనే ఏడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆమెతో పాటు మరో చిన్నారి కూడా అస్వస్థతకు గురైంది. కానీ ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి మెరుగై కోలుకుంది. ఇక చిన్నారి మృతికి ఫుడ్ పాయిజన్ కారణం అని అధికారులు ప్రాధమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటన నవంబర్ 19 న జరిగింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పిహు కుమావత్, దివ్యాన్షి ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో వాళ్లిద్దరూ నూడుల్స్ ను కుక్ చేసుకుని తిన్నారు. అయితే వాటిని తిన్న వెంటనే బాలికలిద్దరూ కాసేపు నిద్రపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో వారి తల్లి రావడంతో పెద్ద కుమార్తె దివ్యాన్షి నిద్రనుంచి లేచి అస్వస్థతకు గురైంది. కానీ చిన్న కుమార్తె పిహూ మాత్రం నిద్రలోనే స్పృహ కోల్పోయింది. అయితే ఇద్దరు బాలికల్ని వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.

అయితే అప్పటికే పిహూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక మరో చిన్నారి దివ్యాన్షి ఆరోగ్య పరిస్థితి మెరుగై ఆస్పత్రి నుంచి శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ అయింది. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఫుడ్ పాయిజన్ జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కానీ చిన్నారి మరణానికి గల అసలైన కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే నూడుల్స్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మరోవైపు బాధితురాలి సోదరుడు గోవింద్.. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications
