బొత్సకు మేనల్లుడు చిన్న శ్రీను ఘాటు కౌంటర్- ఈ స్ధాయిలో తొలిసారి..!
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొన్నేళ్లుగా సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు వెన్నుదన్నుగా నిలిచి, తాజాగా పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి కుమార్తె మజ్జి సిరిని విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ గా గెలిపించుకున్న మజ్జి శ్రీనివాసరావు (Majji Srinivasa Rao) అలియాస్ చిన్న శ్రీను ఇప్పుడు ఆయనపైనే విమర్శలకు దిగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ తీరుపై బొత్స సత్యనారాయణ తాజాగా చేసిన విమర్శలకు మజ్జి శ్రీను కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పై బొత్స వ్యాఖ్యల్ని మజ్జి శ్రీను ఖండించారు.
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై బొత్స సత్యనారాయణ ఇష్టారాజ్యాంగా మాట్లాడుతున్నారని మజ్జి శ్రీను ఫైర్ అయ్యారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయని చిన్న శ్రీను చెప్పుకొచ్చారు. మరోవైపు బీసీల పేరుతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని సైతం మజ్జి శ్రీను తప్పుబట్టారు. బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్న బొత్స.. కార్పోరేషన్ ఎన్నికల్లో వారికి ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో వైసీపీ బీసీలకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వైసీపీకి న్యాయస్దానాలపై కానీ, వెనుకబడిన వర్గాలపై కానీ గౌరవం లేదని మజ్జి శ్రీనివాసరావు ఆరోపించారు. టీడీపీ బీసీల కోసమే పుట్టిన పార్టీ అని, చంద్రబాబు నాయకత్వంలోనే తామంతా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.

రెండు నెలల క్రితం వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరిన తర్వాత మజ్జి శ్రీనివాసరావు సైలెంట్ గానే ఉన్నారు. కానీ తాజాగా ఆయన కుమార్తె మజ్జి సిరి సహస్ర జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసి విజయనగరం జడ్పీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టకుండా ఆమె బీసీ సర్టిఫికెట్ వివాదాన్ని తెరపైకి తెచ్చి వైసీపీ నేతలు హైకోర్టు వరకూ వెళ్లడంపై మజ్జి శ్రీను ఆగ్రహంగా ఉన్నారు. బొత్స సత్యనారాయణ వెనుక ఉండి ఇదంతా చేయిస్తున్నారనే ఆగ్రహంతో ఉన్న మజ్జి శ్రీనివాసరావు ఇలా ఆయన మేనమామపై ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
