Pawan Kalyan: నాకు పులీ ముఖ్యం.. జనం కూడా..! పవన్ కీలక ఆదేశాలు..!
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరులో పులి సంచారం కలకలం రేపుతోంది. దీనిపై అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ (Pawan Kalyan) అధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి కదలికలు, దాని సంచార ప్రాంతాలు, ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎ.కొండూరు పరిసరాల్లోని అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ, ప్రజలకు కునుకు లేకుండా చేస్తున్న పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.
పులి కదలికలపై నిరంతరం నిఘా పెడుతూ, ప్రజల భద్రత భరోసా ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అధికారుల్ని ఆదేశించారు. అవసరాన్ని బట్టి పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అధునాతన సాంకేతికతతోపాటు ఇతర రాష్ట్రాల నిపుణుల సహకారం తీసుకోవాలని సూచించారు. పీసీసీఎఫ్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ స్వీయ పర్యవేక్షణలో ఆపరేషన్ నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. పులి కదలికలను నిరంతరం పర్యవేక్షించాలని, పులి సంచార మార్గాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ సమాచారాన్ని పరిసర గ్రామాల ప్రజలకు చేరవేయాలని తెలిపారు. స్థానిక అటవీ శాఖ బృందాలతో సమన్వయం చేసుకుంటూ హనుమాన్ (H.A.N.U.M.A.N) బృందాలతో విస్తృతంగా గస్తీ ఏర్పాటు చేయాలన్నారు.

పులి కదలికలను మరింత సమర్థవంతంగా గుర్తించేందుకు థర్మల్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరా ట్రాప్‌లు, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను విస్తృతంగా వినియోగించాలని పవన్ పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలు, నిర్దేశిత ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ, అనుభవజ్ఞులైన వన్యప్రాణి నిపుణుల సహకారంతో పులిని సురక్షితంగా పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ప్రజలకుగానీ, పులికిగానీ ఎలాంటి హాని కలగకూడదని కోరారు. ప్రజల ప్రాణరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, పులి సంరక్షణను కూడా బాధ్యతగా తీసుకుని జాగ్రత్తగా, సమన్వయంతో చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పోలీస్, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ, చేపట్టిన చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు కలగకుండా అన్ని చర్యలను, అత్యంత ప్రాధాన్యతతో చేపట్టాలని తెలిపారు.













Click it and Unblock the Notifications
