హైదరాబాద్ లో ఈ రెస్టారెంట్స్ లో ఆన్ లైన్ డెలివరీ బంద్..!
ప్రస్తుతం ఉన్న జీవనవిధానం, ఉరుకులు పరుగుల జీవితం, బిజీ లైఫ్ కారణంగా చాలా మందికి ఇంట్లో వంట చేసుకోవడం కష్టంగా మారింది. అందుకే చాలా మంది బయటి ఫుడ్ ను ప్రిఫర్ చేస్తుంటారు. ఇక జంక్ ఫుడ్ కు అలవాటు పడిన చాలామంది ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని లాగించేస్తుంటారు. ఈ క్రమంలో హైదరాబాద్ లో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న బడా రెస్టారెంట్లు, హోటళ్లు పెరిగిపోతున్నాయి. నగరంలోని చాలా హోటళ్లలో కల్తీ ఆహారం, అపరిశుభ్రమైన వాతావరణం బయటపడుతోంది.
తాజాగా హైదరాబాద్ నగరంలోని 9 ప్రముఖ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 8 ప్రత్యేక బృందాలు 9 హోటళ్లపై దాడులు చేపట్టారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఈ హోటల్స్ నుంచి స్విగ్గీ, జొమాటో వంటి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కూకట్ పల్లిలోని ది స్పైస్ కిచెన్, చైతన్యపురిలోని రాజుగారి బిర్యానీ, నాగోల్ లోని స్వాద్ స్పైసీ, అయ్యప్ప సొసైటీలోని మాదాపూర్ బావార్చి అలాగే బల్కంపేటలోని మెహఫిల్ రెస్టారెంట్, చందానగర్ లోని అన్నపూర్ణ క్యాటరర్స్, టోలీచౌకిలోని మతామ్ అల్ యమామి అరేబియన్ రెస్టారెంట్, అల్ కరీమ్ బేకర్స్, గౌలిదొడ్డిలోని శ్రీలక్ష్మి లగ్జరీ మెన్స్ హాస్టల్ లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా అపరిశుభ్ర వాతావరణం, ఆహార పదార్థాల నిల్వలో నిర్లక్ష్యంతోపాటుగా ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

కల్తీ అనుమానాల నేపథ్యంలో మొత్తం 8 ఆహార నమూనాలను అధికారులు సేకరించారు. సుమారు 135 కిలోల కలుషిత ఆహార పదార్థాలను సీజ్ చేసి వాటిని ధ్వంసం చేశారు. ఇక నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై జరిమానాలతో పాటు తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ తనిఖీలు నిర్వహించినట్లు టీజీ సేఫ్ కమిషనర్ తెలిపారు.












Click it and Unblock the Notifications
