పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
ఏపీలో స్దానిక సంస్ధల ఎన్నికలు అధికార కూటమిలో ఊహించని తుఫాన్ సృష్టిస్తున్నాయి. రెండున్నరేళ్లుగా కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉందంటూ చెప్పుకుంటున్న మూడు పార్టీలూ.. స్ధానిక ఎన్నికలకు వచ్చే సరికి ఎవరి దారిలో వారు సాగిపోతున్నారు. ఇదే క్రమంలో రాయలసీమలోని రేణిగుంట మేజర్ పంచాయతీ స్ధానంలో సర్పంచ్ ఎన్నిక కూటమి పార్టీలైన టీడీపీ-జనసేన మధ్య చిచ్చు రేపుతోంది. ఇక్కడ కూటమి సీట్ల సర్దుబాట్లలో భాగంగా సర్పంచ్ సీటు జనసేనకు కేటాయించగా.. టీడీపీ కూడా పోటీకి దిగింది.
దీంతో గతంలో కూటమి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్న జనసేన నేత కోట వినుత (Kota Vinutha).. ఈసారి మాత్రం మీరు వెనక్కి తగ్గాలని నారా లోకేష్ ను కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు.
ఇందులో కోట వినుత... తన తల్లి, జనసేన సర్పంచ్ స్ధానానికి పోటీ పడుతున్న నగరం జయలలిత అభ్యర్ధిత్వానికి పోటీగా టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టిన స్ధానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎన్నో అక్రమ కేసులు ఎదుర్కొని బెయిల్ కోసం సుప్రీంకోర్టు వరకూ వెళ్లిన వీర మహిళ జయలలిత అని, దాదాపు 1500 క్రియాశీలక సభ్యత్వాలు చేయించారని, పవన్ కళ్యాణ్ సిద్దాంతాల కోసం తన ఎంపీటీసీ పదవికి రాజీనామా చేసి 2019లో జనసేనలో చేరారని వినుత తెలిపారు. అలాంటి నిబద్దత కలిగిన నాయకురాలిని రేణిగుంట మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్దిగా నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్ణయించారన్నారు. జనసేన కేంద్ర కార్యాలయం నుంచి కూటమి తరఫున పోటీ చేయాలని చెప్పారని, కూటమి ధర్మం పాటించాలని, అలాగే రేణిగుంట సర్పంచ్ స్ధానంలో జనసేనకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేకు జనసేన కేంద్ర కార్యాలయం నుంచి తెలియజేశారని తెలిపారు.

ఆయన అంగీకరించకపోవడంతో చివరికి నగరం జయలలితను స్నేహపూర్వక పోటీలో ఉండాలని జనసేన కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినట్లు కోట వినుత తెలిపారు. తమ నియోజకవర్గంలో జనసేనకు కేవలం ఐదారు పంచాయతీలు మాత్రమే కేటాయించారని, అందులోనూ కొన్నింటిని స్క్రూటినీలో నామినేషన్లు తిరస్కరించారన్నారు. ఈ నేపథ్యంలో ఎవరూ నిరాశ చెందవద్దని, తమ అధినేత స్వయంగా ఎంపిక చేసిన జనసేన అభ్యర్ధి నగరం జయలలిత గారిని గెలిపించుకోవడం మన బాధ్యత అన్నారు. ఈ విజయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు గిఫ్ట్ గా ఇద్దామన్నారు. ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా జనసేన కేంద్ర కార్యాలయం నుంచి సమీక్షిస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని గౌరవించి, నగరం జయలలిత గారికి పూర్తి మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేకు చెప్పాలని నారా లోకేష్ ను ఆమె కోరారు. కూటమి తరఫున ఎమ్మెల్యే సీటుతో పాటు చాలా త్యాగాలు చేశామని, సర్పంచ్ సీటుకు జనసేన పోటీ చేస్తుంటే మీరు సహకరించకపోతే ఎలా అని కోట వినుత ప్రశ్నించారు. దయచేసి మీ ఎమ్మెల్యేకు నచ్చచెప్పి, కూటమి ధర్మం పాటించాలని కోట వినుత విజ్ఞప్తి చేశారు.














Click it and Unblock the Notifications
