కాక్రోచ్ జనతా పార్టీ కీలక అడుగు- ఇక దేశవ్యాప్తంగా యూత్ వాయిస్ కోసం ..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ.. ఆ తర్వాత క్రమంగా రోడ్లపైకి వచ్చింది. ఆన్ లైన్ లో సెటైర్లతో మొదలైన సీజేపీ ప్రస్ధానం .. ఇప్పటికీ వారిని నిలబెడుతోంది. అయితే నిరసనలతోనే తమ సంస్థను ముందుకు తీసుకెళ్లలేమని భావిస్తున్న కాక్రోచ్ లు తాజాగా రూటుమారుస్తున్నారు. తాజాగా కేరళ గాంధీ భవన్ లో 'కాక్రోచ్ క్లబ్' పేరుతో మహాత్మగాంధీ ఇప్పుడు బతికుంటే ప్రస్తుత రాజకీయ వాస్తవాలను ఆయనకు చూపించేలా ఓ స్కిట్ చేశారు. దీనికి మంచి ఆదరణ లభించింది. దీంతో ఇప్పుడు ఈ కాక్రోచ్ క్లబ్ ను దేశవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారు.
గతంలో ఢిల్లీ, ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) నిర్వహించిన ఉద్యమాల సందర్భంగా యువత వాయిస్ దేశంలో చాలా మందికి తెలిసింది. ఇప్పుడు దీన్నే కాస్త మార్చి కాక్రోచ్ క్లబ్ (Cockroach Club) పేరుతో కార్యక్రమాలు నిర్వహించడం, వీటిలో యువత వాయిస్ ను అందరికీ వినిపించే ప్రయత్నం చేయాలని సీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు నగరాల నుంచి జిల్లాలు, గ్రామాలకు తాము విస్తరించాలని సీజేపీ భావిస్తోంది. ఇప్పటికే 10 రాష్ట్రాల్లో క్షేత్రస్దాయిలో పనిచేయడానికి సీజేపీ జోనల్ సభ్యుల్ని నియమించారు. ఇది జరిగిన 10 రోజుల తర్వాత కాక్రోచ్ క్లబ్ కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు. ఈ 10 రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే యూపీ కూడా ఉంది.

అయితే ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీని టార్గెట్ చేయడానికే ఇలా చేస్తున్నారా అన్న ప్రశ్నకు.. ఈ సమయం కేవలం యాదృచ్ఛికం అని సీజేపీ నేతలు చెప్తున్నారు. ఎన్నికైన ప్రతినిధులను జవాబుదారీగా ఉంచాలనే లక్ష్యంతో, సభ్యత్వం పెరిగేకొద్దీ ఈ కమిటీలు లోక్‌సభ నియోజకవర్గాలతో ప్రారంభమై, అసెంబ్లీ స్థానాలకు విస్తరిస్తాయని దాని జాతీయ సంస్థాగత ఇన్‌చార్జి అజింక్య షిండే వెల్లడించారు. రాజకీయ, పౌర సంబంధిత ప్రశ్నలను చర్చించడానికి వ్యంగ్యం, కవిత్వం, సంగీతం, వాదోపవాదాలను ఉపయోగించి ఈ సాయంకాల కార్యక్రమం బహిరంగ వేదికపై నిర్వహిస్తున్నారు. భారతదేశం గడిచిన కాలం, భవిష్యత్తు గురించి యువత ఆలోచించడానికి ఒక వేదికను కల్పించడమే తమ లక్ష్యమని సీజేపీ సీనియర్ సభ్యుడు అశుతోష్ రాంకా తెలిపారు. యువతకు సరిగ్గా అలాంటి అవకాశాన్ని కల్పించే ఒక వేదికను సృష్టించడమే ఈ చొరవ వెనుక ఉన్న ఆలోచన అన్నారు.














Click it and Unblock the Notifications
