అందం పేరుతో విషం అమ్ముతున్న పాకిస్థాన్.. బ్యూటీ క్రీముల్లో డేంజర్ కెమికల్స్!
ముఖం తెల్లగా, అందంగా మారుతుందనే ఆశతో విదేశీ బ్యూటీ క్రీమ్స్ వాడేవారికి ఇదో బిగ్ వార్నింగ్. మహారాష్ట్రలోని నాందేడ్‌లో పోలీసులు స్వాధీనం చేసుకున్న పాకిస్థానీ బ్యూటీ క్రీముల్లో అత్యంత ప్రమాదకరమైన విషపూరిత రసాయనాలు ఉన్నట్లు ప్రభుత ల్యాబ్ పరీక్షల్లో తేలింది. ఒక క్రీములో పాదరసం మోతాదు అనుమతించిన పరిమితి కంటే ఏకంగా 48 వేల రెట్లు అధికంగా ఉన్నట్లు బయటపడటం కలకలం రేపుతోంది.
టూర్స్ అండ్ ట్రావెల్స్ ముసుగులో దందా
నాందేడ్ నగరంలోని బర్కీ చౌక్ ప్రాంతంలో ఉన్న 'అఫ్రా కలెక్షన్' అనే షాపులో పాకిస్థాన్‌లో తయారైన సౌందర్య సాధనాలు విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో 4 నెలల క్రితం ఇత్వారా పోలీసులు, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు సంయుక్తంగా ఆ దుకాణ గోదాముపై దాడి చేశారు. దర్యాప్తులో భాగంగా దుకాణ యజమాని మహ్మద్ జియావుద్దీన్ 'టూర్స్ అండ్ ట్రావెల్స్' వ్యాపారం ముసుగులో ఈ అక్రమ దందా నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ దాడిలో మేడ్ ఇన్ పాకిస్థాన్ లేబుల్ ఉన్న వివిధ బ్రాండ్ల నకిలీ సౌందర్య సాధనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.40 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.

ల్యాబ్ రిపోర్టులో విస్తుపోయే నిజాలు
స్వాధీనం చేసుకున్న క్రీముల నమూనాలను పోలీసులు పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ప్రయోగశాలకు పంపారు. తాజాగా వచ్చిన ఆ రిపోర్టులో మెర్క్యురీ, ఆర్సెనిక్ వంటి అత్యంత ప్రమాదకరమైన విషపూరిత మూలకాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. బ్యూటీ సాధనాల నిబంధనల ప్రకారం.. క్రీముల్లోమెర్క్యురీ గరిష్ట పరిమిత 1 పీపీఎం మాత్రమే ఉండాలి. కానీ పట్టుబడిన ఓ బ్యూటీ క్రీములో ఏకంగా 48,453.44 పీపీఎం మెర్క్యురీ ఉన్నట్లు తేలింది. అంటే ఇది గరిష్ట పరిమితి కంటే దాదాపు 48 వేల రెట్లు అధికం. మరో క్రీములో 6,924.94 పీపీఎం(పరిమితి కంటే సుమారు 7 వేల రెట్లు ఎక్కువ) మెర్క్యురీ ఉన్నట్లు గుర్తించారు.
మెర్క్యురీ, ఆర్సెనిక్ వంటి విషపూరిత రసాయనాలు కలిసిన క్రీములను దీర్ఘకాలం పాటు వాడటం వల్ల చర్మ వ్యాధులతో పాటు కిడ్నీలు, నాడీ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.













Click it and Unblock the Notifications
