భారత్ నిఘా కళ్లుగప్పేందుకు పాక్ మాస్టర్ ప్లాన్.. సిక్కుల కోసం స్పెషల్ వీసా!
ఇండియాలోని పంజాబ్‌లో మరోసారి ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమాన్ని రాజేసేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ సరికొత్త కుట్రకు తెరలేపింది. భారత భద్రతా సంస్థల కళ్లుగప్పి కొందరు ఎంపిక చేసిన భారత సిక్కులను తమ దేశానికి రప్పించుకునేందుకు పాకిస్థాన్ ఓ స్పెషల్ 'ప్రీమియం వీసా, ట్రావెల్ ఫిసిలిటీ" ప్లాన్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా వారి పోస్పోర్టులపై ఎలాంటి ఇమ్మిగ్రేషన్ స్టాంపులు లేకుండానే పాకిస్థాన్‌లోకి ప్రవేశించి తిరిగి వెళ్లే వెసులుబాటు కల్పిస్తోంది.
అసలేంటీ స్పెషల్ వీసా ప్లాన్?
భారత అత్యున్నత భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. పంజాబ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఖలిస్థాన్ అనుకూల వర్గాలపై తమ పట్టును పెంచుకోవడమే లక్ష్యంగా ఐఎస్ఐ ఈ పథకాన్ని రూపొందించింది. ఇందుకోసం పాకిస్థాన్ లోని పలు సిక్కు పుణ్యక్షేత్రాలను పునరుద్ధరించడంతో పాటు ఎంపిక చేసిన వ్యక్తుల కోసం ప్రత్యేక ఈ-వీసా, స్మార్ట్ గేట్ ఇమ్మిగ్రేషన్ సర్వీస్, స్పెషల్ గ్రీన్ ఛానల్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసింది. వీరి రాకపోకల వివరాలను కేవలం డిజటల్ రూపంలో మాత్రమే నమోదు చేస్తారు తప్ప.. పాస్‌పోర్టుపై భౌతికంగా ఎలాంటి ముద్ర వేయరు.

మూడో దేశం మీదుగా పాకిస్థాన్‌కు ఆహ్వానం
ఈ రహస్య ప్రణాళికకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టును ఐఎస్ఐ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసి, ఇప్పుడు పెద్ద ఎత్తున అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ ప్లాన్ కింద ఎంపికైన సిక్కులను నేరుగా భారత్ నుంచి కాకుండా పాకిస్థాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న మూడో దేశం(టర్కీ, అజర్ బైజాన్, సౌదీ అరేబియా వంటి దేశాలు) మీదుగా పాకిస్థాన్ కు రావాలని సూచిస్తున్నారు.
పాకిస్థాన్ ఎయిర్‌పోర్టుల్లో దిగగానే ప్రత్యేక స్మార్ట్ గేట్లు లేదా గ్రీన్ ఛానెళ్ల ద్వారా వీరిని లోపలికి అనుమతిస్తారు. పాస్‌పోర్టుపై పాకిస్థాన్ ఇమ్మిగ్రేషన్ స్టాంప్ లేకపోవడం వల్ల ఆయా వ్యక్తులు పాక్ వెళ్లి వచ్చిన విషయాన్ని భారత ఇమ్మిగ్రేషన్, నిఘా సంస్థలు గుర్తించడం కష్టతరం అవుతుందన్నది ఐఎస్ఐ ముఖ్యం ఉద్దేశం. పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో పాక్ పన్నిన ఈ భారీ కుట్రపై భారత నిఘా సంస్థలు అప్రమత్తమయ్యాయి.














Click it and Unblock the Notifications
