రేపు ఏపీలో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులూ..! సర్కార్ ఉత్తర్వులు..!
ఏపీలో నవంబర్ 14న రెండో శనివారం సందర్భంగా ఇచ్చే సెలవు దినాన్ని (Holiday) రద్దు చేశారు. వివిధ కారణాలతో స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు ఇలా ప్రతీ చోటా రెండో శనివారం రోజు కూడా సాధారణ పని దినంగానే భావించాల్సి ఉంటుంది. తుఫాన్ల కారణంగా విద్యాసంస్థలకు, దసరాకు అదనంగా సెలవు ఇచ్చిన కారణంతో ఆఫీసులూ రేపు పనిచేయబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఎక్కడికక్కడ ఉత్తర్వులు జారీ చేస్తోంది. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యా సంస్థలూ పనిచేయాల్సి ఉంది.
రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో రెండు వరుస తుఫాన్లు వచ్చాయి. అర్నబ్ తుఫాన్, ఆ తర్వాత మురసు తుఫాన్ కారణంగా విద్యార్ధులకు వరుసగా రెండు, మూడు రోజుల పాటు సెలవులు ఇవ్వక తప్పలేదు. దీంతో విద్యాసంవత్సరంలో ఉండాల్సిన పని దినాల సంఖ్య తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో రెండో శనివారాలకు ఇస్తున్న సెలవుల్ని పలు జిల్లాల్లో రద్దు చేస్తున్నారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి పల్నాడు, ప్రకాశం జిల్లాల వరకూ పలు చోట్ల విద్యాశాఖాధికారులు రెండో శనివారం సెలవు రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. దీంతో రేపు యథావిధిగా విద్య సంస్థలు పనిచేయబోతున్నాయి. తుఫాన్ ప్రభావం లేని జిల్లాల్లో మాత్రం యథావిధిగా సెలవు ఇస్తారు.

అలాగే ప్రభుత్వ కార్యాలయాలు కూడా నవంబర్ 14న రెండో శనివారం సెలవు తీసుకోకుండా పనిచేయబోతున్నాయి. దీని వెనుక మరో కారణం ఉంది. ఈ ఏడాది దసరా సందర్భంగా వరుసగా సెలవులు వచ్చాయి. మధ్యలో ఒక రోజు పని దినం రావడంతో ఆ రోజు కూడా సెలవు కావాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. దీంతో ప్రభుత్వం అక్టోబర్ 19న సెలవు ఇచ్చి, దానికి బదులుగా నవంబర్ లో రెండో శనివారం పనిచేయాలని ఉద్యోగులకు సూచించింది. ఈ నేపథ్యంలో రేపు రెండో శనివారం సెలవు రద్దు చేసి సాధారణ పని దినంగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికలు, విజయవాడలో జాతీయ సరస్ మేళాతో పాటు పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇలా పాల్గొన్న వారికి మాత్రం రేపు యథావిధిగా రెండో శనివారం సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి రేపు సెలవు దినంగానే ఉంటుంది. మిగతా ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది.














Click it and Unblock the Notifications
