JEE Advanced 2027 Date: జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష తేదీ ఖరారు-ఈసారి కొత్తగా ఇవే..!
దేశంలోని ప్రతిష్టాత్మక ఉన్నత విద్య సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష తేదీ (JEE Advanced 2027 Date) ఖరారైంది. ఈసారి జేఈఈ పరీక్షలు నిర్వహిస్తున్న ఐఐటీ ఢిల్లీ ఈ మేరకు పరీక్ష తేదీతో పాటు ఇతర వివరాలను ఇవాళ విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది మే 23న జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష జరగనుంది. అలాగే ఈసారి జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష కోసం ప్రత్యేకంగా అధికారిక వెబ్ సైట్ ను ప్రారంభించింది.
జేఈఈ అడ్వాన్సెడ్ 2027 పరీక్ష ద్వారా ఐఐటీల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్ధుల కోసం jeeadv.ac.in వెబ్ సైట్ ను అందుబాటులోకి తెచ్చినట్లు ఐఐటీ ఢిల్లీ తెలిపింది. అలాగే ఈ పరీక్షకు హాజరవ్వాలనుకునే అభ్యర్ధుల అర్హతా ప్రమాణాలను కూడా ఐఐటీ ఢిల్లీ ఈ పోర్టల్ లో అందుబాటులో ఉంచింది. ఈ పరీక్షకు సంబంధించిన అప్ డేట్ ల కోసం క్రమం తప్పకుండా తమ వెబ్ సైట్ ను ఫాలో కావాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే పరీక్షా ప్రక్రియ ముందుకు సాగుతున్న కొద్దీ, ఆశావహులకు అవసరమైన మరిన్ని వివరాలు ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు.

ఈసారి జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్షలో అభ్యర్ధులకు ఓ సదుపాయం అమల్లోకి రానుంది. అది ఆన్ స్క్రీన్ క్యాలిక్యులేటర్. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2027 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు, పరీక్ష సమయంలో ఆన్-స్క్రీన్ బేసిక్ కాలిక్యులేటర్‌ను వాడుకోవచ్చని ఐఐటీ ఢిల్లీ తెలిపింది. ఇది సైంటిఫిక్ కాలిక్యులేటర్ కాదని, అయితే ఇందులో 10 నుండి 12 అంకెల డిస్‌ప్లే ఉంటుందని పేర్కొంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలు కావాలనుకునే అభ్యర్ధులు ముందుగా జేఈఈ మెయిన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఇందులో 2.5 లక్షల మంది టాప్ మార్కులు వచ్చిన అభ్యర్ధుల్ని జేఈఈ అడ్వాన్సెడ్ కు ఎంపిక చేస్తారు. వారు జేఈఈ అడ్వాన్సెడ్ పరీక్ష రాయడం ద్వారా ఐఐటీల్లో ప్రవేశాలకు అర్హత సాధించాల్సి ఉంటుంది. ఇందులో అన్ని రిజర్వేషన్లు, ఇతర నిబంధనలు ఉంటాయి. ఇవన్నీ దాటుకుని వస్తే అప్పుడు ఫైనల్ గా ఐఐటీ సీటు ఖరారవుతుంది.














Click it and Unblock the Notifications
