తెలంగాణా సీఎం రేవంత్ కు బిగ్ టాస్క్ ఇచ్చిన సీఎం చంద్రబాబు!
పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఒకరిని మించి మరొకరు పెట్టుబడులను ఆకర్షించాలని శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాష్ట్రాలు విడిపోయిన నాటి నుండి అనేక అంశాలలో కంటికి కనిపించని పోటీ కొనసాగుతుంది. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా అభివృద్ధి విషయంలో రెండు రాష్ట్రాలను పోల్చి చూడటం ప్రధానంగా కనిపిస్తుంది.
ఇక ఎక్కువ పెట్టుబడులు సాధిస్తే , పారిశ్రామిక ప్రగతి జరిగితే స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు అవ్వటం మాత్రమే కాకుండా, ఆర్ధిక పురోగతి కూడా సాధ్యం అవుతుంది.ఈ క్రమంలో రెండు రాష్ట్రాల మధ్య జరుగుతున్న పెట్టుబడుల పోటీలో ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు కేంద్ర మంత్రులు, దేశవ్యాప్తంగా పెద్ద పారిశ్రామికవేత్తలను ఆహ్వానించి పెట్టుబడులు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే పెద్ద మొత్తంలో ఎంవోయూలు కుదురుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి.ఇక తెలంగాణ వైపు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్‌లో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సదస్సు జరగనుంది. ఆరు ఎగ్జిబిషన్ హాల్స్‌తో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఐటీ, ఫార్మా, డిఫెన్స్, ఎడ్యుకేషన్, స్టార్టప్‌లు వంటి రంగాలపై దృష్టి సారించనున్నారు.
అయితే ఏపీలో ముందుగానే పెద్ద స్థాయి సమ్మిట్ నిర్వహించి, కేంద్ర మంత్రులు, టాప్ ఇండస్ట్రియలిస్టులను తీసుకువచ్చి పెట్టుబడులు ఆకర్షించిన తర్వాత... తెలంగాణలో అంతే స్థాయిలో పెట్టుబడులు వస్తాయా? అంతమంది ప్రముఖులను తీసుకురావడంలో రేవంత్ రెడ్డి విజయం సాధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది .చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగంలో అనుభవం ఉన్న నాయకుడు. గతంలోనూ పెట్టుబడుల ఆకర్షణలో ముందుండేవారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కేంద్రంతో సత్సంబంధాలు ఉండటం వల్ల కేంద్ర మంత్రుల సహాయ సహకారాలతో పెద్ద కంపెనీలు సులభంగా వచ్చే అవకాశం ఉంది.
సీఐఐ సమ్మిట్‌లో ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రకటనలు వస్తున్నాయి. తెలంగాణ వైపు చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా పెట్టుబడులపై దృష్టి సారిస్తోంది. గ్లోబల్ సమ్మిట్‌ను పెద్ద ఎత్తున నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. అయితే సమయం పరంగా ఏపీ ముందుండటం, కేంద్రంతో సంబంధాలు వంటి అంశాలు తెలంగాణకు సవాలుగా మారే అవకాశం ఉంది.
పెట్టుబడిదారులు ఒకేసారి రెండు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవచ్చు. ఎవరు ముందు మెరుగైన వాతావరణం, ప్రోత్సాహకాలు అందిస్తే వారి వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.రెండు రాష్ట్రాలు పెట్టుబడుల కోసం పోటీ పడటం మంచిదే. దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సమయం పరంగా, సంబంధాల పరంగా ఒక అడుగు ముందున్నట్లు కనిపిస్తోంది. డిసెంబర్‌లో జరిగే తెలంగాణ సమ్మిట్ కు సీఎం చంద్రబాబు రేవంత్ కు పెద్ద టాస్క్ ఇచ్చినట్టు అయ్యింది.













Click it and Unblock the Notifications
