టారిఫ్ లపై భారత్ కు అమెరికా గుడ్ న్యూస్- వాణిజ్య డీల్ చర్చల్లో కీలక హామీ..!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) సంబంధించి కొంతకాలంగా చర్చలు జరుగుతూనే ఉన్నా పురోగతి మాత్రం కనిపించడం లేదు. ఇదిగో , అదిగో అంటూనే అమెరికా కాలం గడిపేస్తోంది. దీంతో ఈ డీల్ ఇంక కుదిరినట్లే అని కేంద్రం కూడా నిట్టూర్చేసింది. ఇలాంటి సమయంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పంద చర్చల్లో ఇవాళ కీలక పురోగతి లభించింది. అదీ భారత్ పై సుంకాల విధింపు విషయంలో వాషింగ్టన్ నుంచి కీలక హామీ లభించింది.
సుంకాల విషయంలో పోటీ దేశాలతో పోలిస్తే భారత్ కు మినహాయింపు ఇచ్చేందుకు అమెరికా ఇవాళ అంగీకరించింది. అమెరికా సుంకాల విధానం ప్రకటించినప్పుడు దీనిపై స్పష్టత ఇస్తామని తెలిపింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వర్గాలు కీలక వివరాలు వెల్లడించాయి. ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేపు భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరుదేశాలూ ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య చర్చల తర్వాత భారత్ కు సుంకాల విషయంలో పోటీ దేశాల కంటే ఊరట కల్పించేందుకు అంగీకరిస్తే ఈ డీల్ ముందుకెళ్తుందని కేంద్రం పదే పదే చెబుతోంది. ఇప్పుడు అన్నట్లుగానే ఆ విషయంలో అమెరికా నుంచి కీలక హామీ లభించింది. ఇప్పుడు ఈ హామీ నేపథ్యంలో అమెరికా బృందం భారత్ లో పర్యటించి డీల్ లో పొందుపర్చాల్సిన విషయాల్ని ఖరారు చేస్తుందని వాణిజ్య మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. ఇండోనేషియా, మలేషియా, పాకిస్తాన్, శ్రీలంక వంటి దేశాలతో పోలిస్తే భారత్ కు తక్కువ సుంకాల్ని ఖరారు చేసే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో అమెరికా నుంచి మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














Click it and Unblock the Notifications
