భారత్- పాకిస్థాన్ మధ్య అణుయుద్ధాన్ని ఎవరూ ఆపలేరు.. పాక్ దౌత్యవేత్త సంచలన వార్నింగ్..!
భారత్- పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న సంగతి తెలిసిందే. గతేడాది ఏప్రిల్ 22 న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లోయలో పాకిస్థాన్ ఉగ్రమూకలు భారత పర్యటకులపై జరిపిన భీకర కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది. అలాగే వందలాది మంది ఉగ్రమూకలను ఏరివేసింది. అంతేకాక పాకిస్థాన్ తో ఉన్న సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. అటు పాకిస్థాన్ సైతం భారత్ విమానాలు తమ గగనతలం పై నుంచి వెళ్లకుండా నిషేధం విధించింది. ఏడాదిన్నరగా ఆ నిషేధాన్ని పొడిగిస్తూ వస్తూనే ఉంది. అలాగే భారత్ కూడా పాకిస్థాన్ కు సంబంధించిన విమానాలను తమ గగనతలం గుండా ప్రయాణించకుండా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ఉద్రిక్త వాతావరణంపై పాకిస్థాన్ కు చెందిన సీనియర్ దౌత్యవేత్త, ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ శాశ్వత ప్రతినిధి మునీర్ అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్- పాకిస్థాన్ మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు తీవ్రతరం అయితే భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య అణుయుద్ధం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య కాశ్మీర్, సింధు జలాల పంపిణీతో పాటు పరిష్కారం కాని అనేక సమస్యలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధం జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. పాకిస్థాన్ లోని జియో న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని పేర్కొన్నారు.

మరోవైపు భారత్ .. తన రక్షణ సామర్థ్యాన్ని నిరంతరం పెంచుకుంటోందని తద్వారా పాకిస్థాన్ పై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రయత్నాలు చేస్తోందని మునీర్ అక్రమ్ తెలిపారు. అంతేకాక అఫ్గానిస్తాన్ లోని కొన్ని వ్యతిరేక సంస్థలకు భారత్ మద్దతుగా నిలుస్తోందని కీలక ఆరోపణలు చేశారు. అలాగే ఇరు దేశాల మధ్య ఉన్న కాశ్మీర్ సమస్యను పరిష్కరించుకునేందుకు భారత్ ముందుకు రావడం లేదని.. అటు సింధు జలాల పంపిణీ నిలిపివేత కారణంగా భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరినట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగేందుకు ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయన్న హింట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.












Click it and Unblock the Notifications
