పృథ్వీ షా vs యోగరాజ్ సింగ్.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన క్రికెటర్!
భారత క్రికెట్ జట్టుకు దూరమై ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడుతున్న యువ ఓపెనర్ పృథ్వీ షా.. మాజీ క్రికెటర్, యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ చేసిన కామెంట్లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలు, మద్యపానం, చెడు అలవాట్ల వల్లే పృథ్వీ షా కెరీర్ నాశనమైందని, అతని పరిస్థితి మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీలా తయారైందని యోగరాజ్ సింగ్ ఇటీవల చేసిన కామెంట్లు దుమారం రేపాయి. దీనిపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించిన పృథ్వీ షా.. తన పేరు, వ్యక్తిగత జీవితాన్ని అడ్డం పెట్టుకుని పబ్లిసిటీ పొందాలని చూస్తే చట్టపరమైన చర్యలు తప్పవని గట్టి హెచ్చరిక జారీ చేశారు.
అసలు యోగరాజ్ సింగ్ ఏమన్నారంటే?
ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. పృథ్వీ షా కెరీర్ పతనానికి అతని జీవనశైలే కారణమని ఆరోపించారు. "పృథ్వీ షా కెరీర్ ఎందుకు పాడైంది? గతంలో వినోద్ కాంబ్లీకి కూడా ఇదే జరిగింది. పార్టీలు చేసుకోవడం, అమ్మాయిలతో తిరగడం, సిగరెట్లు, మద్యం సేవించడం వల్లే వారిద్దరి కెరీర్లు దెబ్బతిన్నాయి" అని యోగరాజ్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా వినోద్ కాంబ్లీకి సంబంధించిన ఓ పాత ఉదంతాన్ని గుర్తు చేస్తూ.. రాత్రి 2.30 గంటల వరకు పార్టీలు చేసుకుని మరుసటి రోజు మ్యాచ్‌లో విఫలమైన విషయాన్ని ప్రస్తావించి.. పృథ్వీ షాను కూడా ఆ కోవలోనే యోగరాజ్ సింగ్ పోల్చారు.

పృథ్వీ షా స్ట్రాంగ్ కౌంటర్
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహారాష్ట్ర తరఫున ఆడుతున్న పృథ్వీ షా.. యోగరాజ్ సింగ్ కామెంట్లపై ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. ఓ వీడియోను షేర్ చేస్తూ సుదీర్ఘ నోట్ రాశారు. "నా గతం నా జీవితంలో ఓ భాగం. దానిని దాచుకోవాల్సిన అవసరం గానీ, దాని గురించి సిగ్గుపడాల్సిన అవసరం గానీ నాకు లేదు. కానీ నా పేరును, వ్యక్తిగత జీవితాన్ని లేదా నా గతాన్ని వాడుకుని నెగటివిటీని వ్యాప్తి చేయడానికి, అనవసర వివాదాలు సృష్టించడానికి, నా ప్రతిష్టను దిగజార్చడానికి లేదా పబ్లిసిటీ పొందడానికి నేను ఎవరినీ అనుమతించను" అని పృథ్వీ షా స్పష్టం చేశారు.
లీగల్ యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్
అభిప్రాయాలను వ్యక్తపరచడం వేరు, ఒకరిని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేయడం వేరని పృథ్వీ షా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే ఏ వ్యక్తిపై అయినా లేదా ఏ ప్లాట్‌ఫాంపై అయినా చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తనకు ఉందన్నారు. తన గౌరవం, వ్యక్తిగత జీవితం, ఇమేజ్‌ను కాపాడుకోవడానికి లీగల్ యాక్షన్ తీసుకోవడానికి తాను ఏ మాత్రం వెనుకాడనన్నారు. తన మౌనాన్ని ఎప్పుడూ బలహీనతగా భావించవద్దని.. జీవితంలో ముందుకు సాగాలనుకుంటున్నానని.. కానీ అవసరమైతే తన కోసం తన గళం విప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అంటూ పృథ్వీ షా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
2018లో టెస్ట్ అరంగేట్రంలో సెంచరీ బాది 'నెక్స్ట్ సచిన్ టెండూల్కర్' అని ప్రశంసలు అందుకున్న పృథ్వీ షా.. ఫామ్ లేమి, ఫిట్‌నెస్ కారణాలతో 2021 తర్వాత భారత జట్టుకు దూరమయ్యారు. తాజా వివాదంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు.














Click it and Unblock the Notifications
