ట్రోలింగ్‌కు బొత్స అనూష చెక్..వైసీపీ నేతలకు కొత్త పాఠం?
సోషల్ మీడియాలో విమర్శలు చేయడం ఒక ఎత్తయితే..వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా ట్రోల్ చేయడం మరో ఎత్తు.రాజకీయ విభేదాల పేరుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదని బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష నిరూపించారు.తనపై జరిగిన సోషల్ మీడియా దాడులను ఎదుర్కొనేందుకు ఆమె ఎంచుకున్న న్యాయపోరాటం ఇప్పుడు రాజకీయ,డిజిటల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఆహార్యం,యాసపై ట్రోలింగ్..కోర్టును ఆశ్రయించిన అనూష
ఎన్నికల ఫలితాల అనంతరం తన ఆహార్యం,ఉత్తరాంధ్ర యాసను లక్ష్యంగా చేసుకుని కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు ప్రచారం చేశారని అనూష ఆరోపించారు.వీటిపై మౌనంగా ఉండకుండా చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.హైదరాబాద్ నివాసిగా సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

గూగుల్,మెటా,ఎక్స్‌కు కోర్టు ఆదేశాలు
తన పిటిషన్లో గూగుల్,మెటా,ఎక్స్ వంటి ప్రముఖ సోషల్ మీడియా సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు.అభ్యంతరకర కంటెంట్ తొలగింపు,సంబంధిత ఖాతాల వివరాలు,ఐపీ అడ్రస్‌ల గుర్తింపు అభ్యంతరకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని,నిందితుల ఐపీ అడ్రస్‌లను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌లకు చేసిన ఫిర్యాదులతో పదుల సంఖ్యలో వీడియోలు తొలగిపోయాయి.1.70 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఓ ఛానెల్ సస్పెండ్ కావడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది.
వైసీపీ సోషల్ మీడియా వ్యూహంపై చర్చ
ఈ పరిణామం వైసీపీ వర్గాల్లోనూ కొత్త చర్చకు తెరతీసింది.వైఎస్ జగన్,ఆయన కుటుంబ సభ్యులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు,వ్యక్తిగత విమర్శలు వస్తున్నప్పుడు పార్టీ సోషల్ మీడియా విభాగం ఇలాంటి చట్టపరమైన చర్యలను ఎందుకు విస్తృతంగా చేపట్టడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అనూష అనుసరించిన న్యాయపరమైన మార్గాన్ని పార్టీ నేతలు పరిశీలించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.నిన్నమొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఉత్తరాంధ్ర రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు బొత్స ఫ్యామిలీ సోషల్ మీడియా టీం పనితీరును చూసి,తమకూ ప్రత్యేక బృందాలను నియమించుకుంటున్నారని,మిగతా నేతలు కూడా అనూష టీం వ్యూహాలను అనుసరించాలని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
భావప్రకటనా స్వేచ్ఛకు,వ్యక్తిగత గౌరవానికి మధ్య గీత
రాజకీయ విమర్శలు ప్రజాస్వామ్యంలో సహజం.అయితే విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు,వేధింపులకు పాల్పడితే చట్టాన్ని ఆశ్రయించే అవకాశం ఉందనే అంశాన్ని ఈ ఘటన మరోసారి తెరపైకి తెచ్చింది.సోషల్ మీడియాలోనూ బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమనే చర్చకు బొత్స అనూష న్యాయపోరాటం కేంద్రంగా మారింది.












Click it and Unblock the Notifications
