బెంగాల్ పేరు మార్చేస్తున్న సువేందు అధికారి- రాష్ట్రం కొత్త పేరు ఇదే..!
పశ్చిమ బెంగాల్ (West Bengal) రాష్ట్రం పేరును మార్చాలని అక్కడి బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇవాళ కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 9న రాష్ట్ర అసెంబ్లీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటిస్తామని సువేందు అధికారి వెల్లడించారు. సీఎం నిర్ణయం ప్రకారం పశ్చిమ బెంగాల్ పేరు కాస్తా త్వరలో పశ్చిమ్ బంగ (Paschim Banga)గా మారబోతోంది. ఈ మేరకు బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం చేయబోతున్నారు.
పశ్చిమ బెంగాల్ కు పశ్చిమ బంగా అని పేరు మార్చే ప్రతిపాదన వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని సీఎం సువేందు అధికారి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 14వరకూ జరగబోతున్నాయి. ఈ మధ్యలో డిసెంబర్ 9న రాష్ట్రం పేరును పశ్చిమ బంగాగా మారుస్తూ ఓ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదిస్తారు. తాజాగా బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య కూడా ఈ విషయాన్ని ప్రకటించారు.

గతంలో 1999లో జ్యోతి బసు నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా ఇదే పేరును రాష్ట్రానికి పెట్టేలా అసెంబ్లీలో ఓ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే అప్పట్లో కేంద్ర ప్రభుత్వం దీనికి అంగీకరించలేదు. అనంతరం 2011లో మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక మరోసారి ఈ పేరు మార్పు కోసం అసెంబ్లీ తీర్మానం ఆమోదించారు. తర్వాత మంత్రి పార్థా ఛటర్జీ, విపక్ష నేత సూర్యకాంత్ మిశ్రాతో ఇద్దరు సభ్యుల సంప్రదింపులు కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ బంగా, బంగ్లా, బంగా ప్రదేశ్, పశ్చిమ బంగా, పౌండ్ర బర్ధన్ వంటి పేర్లను ప్రతిపాదించింది. తర్వాత అఖిలపక్ష భేటీలో పశ్చిమ బంగ పేరును ఖరారు చేశారు. కానీ ఈ ప్రతిపాదనకు సైతం కేంద్ర ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆమోదం తెలపలేదు. దీంతో ఈ ప్రతిపాదన అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. మళ్లీ ఇన్నాళ్లకు సువేందు అధికారి రాష్ట్రంలో మమత ముద్ర చెరిపేసి తన ముద్రను స్థాపించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.














Click it and Unblock the Notifications
