నా ప్లాన్ అమలుచేస్తే కాంగ్రెస్‌కు 100 సీట్లు గ్యారెంటీ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి బీఎం సందీప్‌తో సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రస్తుత పరిస్థితుల్లోనే కనీసం 90 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, తాను సూచించిన ప్రణాళికను పార్టీ అమలు చేస్తే వందకు పైగా స్థానాల్లో విజయం సాధించడం తథ్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించాలని కోరుతూ, ఏళ్ల తరబడి కాంగ్రెస్ కోసం కష్టపడుతున్న కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు, తగిన గుర్తింపు ఇవ్వాలని పార్టీ ఇన్‌ఛార్జిని కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని, ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు దిక్సూచిగా మారుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కోమటిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
గత 12 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు కీలకమైన రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు సంబంధించి 96 శాతం భూసేకరణ పూర్తయినప్పటికీ కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
టెండర్లను మూడుసార్లు వాయిదా వేశారని, అలాగే సుమారు రూ.12 వేల కోట్లతో చేపట్టాల్సిన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను ఆమోదం తర్వాత కూడా పెండింగ్‌లో ఉంచడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర నిధులను రాబట్టడంలో విఫలమైతే, ప్రస్తుతం తమ ప్రభుత్వం అన్ని అనుమతులు సిద్ధం చేసినా కేంద్రం రాజకీయ కోణంలో జాప్యం చేస్తోందని కోమటిరెడ్డి ఆరోపించారు.
మరోవైపు, ఇదే వేదికపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గాంధీభవన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఏడేళ్ల పాటు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశానని, ప్రస్తుతం తన శాఖలో అభివృద్ధి పనులను విరామం లేకుండా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నానని వివరించారు.












Click it and Unblock the Notifications
