ఒక్క భేటీతో ఆ దేశానికి జాక్‌పాట్.. భారత ప్రధాని మోదీ ఇచ్చిన వరాలేంటి?
భారత్, నేపాల్ ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. నేపాల్ ప్రధాని బాలేంద్ర షా భారత పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశానికి పలు కీలక వరాలు ప్రకటించారు. ముఖ్యంగా నేపాల్ యువతను సాంకేతికంగా, విద్యాపరంగా బలోపేతం చేసేందుకు అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్‌షోర్ క్యాంపస్‌తో పాటు స్టార్టప్ ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్ హబ్ లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రకటించారు.
వికసిత్ భారత్-సమున్నత్ నేపాల్ లక్ష్యంగా అడుగులు
నేపాల్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ద్వైపాక్షిక పర్యటనపై ఇండియాకు వచ్చిన బాలేంద్ర షాతో ప్రధాని మోదీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "నేపాల్ యువతలో అపారమైన ప్రతిభ, శక్తి, పెద్ద కలలు ఉన్నాయి. వారి కలలను సాకారం చేయడంలో భారత్ పూర్తి సహకారం అందిస్తుంది. ఇందులో భాగంగానే నేపాల్‌లో ఐఐటీ క్యాంపస్, స్టార్టప్ ఇంక్యుబేటర్, ఇన్నోవేషన్ హబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. అంతే కాకుండా లా, టెక్నాలజీ రంగాల్లో నేపాల్ విద్యార్థులకు ఇండియాలో స్కాలర్షిప్ అవకాశాలను మరింత విస్తరిస్తాం" అని మోదీ వెల్లడించారు. వికసిత్ భారత్-సమున్నత్ నేపాల్ లక్ష్యాలను సంయుక్తంగా సాధించేందుకు ఇరు దేశాలు జారీ చేసిన 'జాయింట్ విజన్ డాక్యుమెంట్'లో ఈ నిర్ణయాలు కీలక పాత్ర పోషించనున్నాయి.

ఆగ్రో-ఇండస్ట్రియల్ పార్క్, క్రికెట్ అభివృద్ధికి సహకారం
విద్య, టెక్నాలజీ రంగాలతో పాటు ఇతర కీలక రంగాల్లోనూ ఇరు దేశాల మధ్య సహకారాన్ని విస్తరించేందుకు ఒప్పందాలు కుదిరాయి. నేపాల్‌లో ఫుడ్ ప్రాసెసింగ్, వాల్యూ అడిషన్‌ను ప్రోత్సహించేందుకు అక్కడ ఆగ్రో-ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధిలో భారత్ భాగస్వామ్యం కానుంది. ఇరు దేశాల యువ క్రియేటర్లు సినిమాలు, ఆధునిక టెక్నాలజీ ద్వారా తమ ఉమ్మడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా రాబోయే 'వేవ్స్' సమ్మిట్‌కు నేపాల్ నుంచి భారీ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించనున్నారు. అలాగే నేపాల్‌లో క్రికెట్ క్రీడ అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన, ఆటగాళ్ల శిక్షణకు భారత్ అండగా నిలవనుంది.
నేపాల్‌కు 24 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ
గత ఆగస్టులో నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల వల్ల జరిగిన ప్రాణనష్టంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో నేపాల్‌కు భారత్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ.. వరద అనంతర పునర్నిర్మాణం, దీర్ఘకాలిక అభివృద్ధి కోసం 24,000 కోట్ల నేపాలీ రూపాయల డెవలప్మెంట్ కోఆపరేషన్ ప్యాకేజీని ప్రకటించారు. బాధిత కుటుంబాల జీవితాలను తిరిగి గాడిలో పెట్టడంతో పాటు భవిష్యత్తులో విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ ప్యాకేజీ ముఖ్య ఉద్దేశమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
బాలేంద్ర షా నాయకత్వంపై ప్రధాని మోదీ ప్రశంసలు
ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా కొద్ది నెలల క్రితం ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన బాలేంద్ర షా విజన్ ను ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. నేపాల్ ప్రజలు ఆయనకు ఇచ్చిన చారిత్రక తీర్పు ఆ దేశ కొత్త తరం ఆశలు, ఆకాంక్షలకు అద్ధం పడుతోందని పేర్కొన్నారు.














Click it and Unblock the Notifications
