ప్రతీ పౌరుడికీ కేంద్రం రూ.30 వేలు సబ్సిడీ ? PIB ఫ్యాక్ట్ చెక్ లో క్లారిటీ..!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతీ పౌరుడికీ రూ.30 వేలు సబ్సిడీ ఇవ్వబోతున్నట్లు వాట్సాప్ లో ఓ మెసేజ్ తాజాగా చక్కర్లు కొడుతోంది. ప్రభుత్వం యూనివర్శిడీ సబ్సిడీ పథకం కింద ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు తెలియడంతో చాలా మంది దీనిపై గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. దీనిపై వాట్సాప్ లో వస్తున్న మెసేజ్ లను క్లిక్ చేయాలా వద్ద అనే సందిగ్ధంలో కూడా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీనిపై క్లారిటీ ఇచ్చింది.
'ప్రభుత్వ సార్వత్రిక సబ్సిడీ పథకం 2026' కింద ప్రతి పౌరుడికి ₹30,000 సబ్సిడీ లభిస్తుందని వాట్సాప్‌లో ఒక సందేశం ప్రచారం అవుతున్నట్లు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లో (Fact Check) తెలిపింది. ఈ సబ్సిడీని పొందాలనుకునే వారిని ఒక అనుమానాస్పద లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోమని అది కోరుతోందని వెల్లడించింది. అయితే ఈ సబ్సిడీ ఫేక్ అని తేల్చేసింది. భారత ప్రభుత్వం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదని స్పష్టత ఇచ్చింది. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దు లేదా వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ వివరాలను పంచుకోవద్దని పౌరులకు సూచించింది.

ఏదైనా సమాచారాన్ని ఎల్లప్పుడూ అధికారిక మూలాల ద్వారా ధృవీకరించుకోవాలని, ధృవీకరించని వాదనలను ఫార్వార్డ్ చేయకుండా ఉండాలని పౌరుల్ని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కోరుతోంది. తద్వారా వాట్సాప్ లో కేంద్ర ప్రభుత్వం 30 వేలు సబ్సిడీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని, అలాగే ఇలాంటి మెసేజ్ లు వాట్సాప్ లో వస్తే క్లిక్ చేయడం కానీ, ఇతరులకు ఫార్వాడ్ చేయడం కానీ చేయొద్దని పౌరులకు సూచిస్తోంది. కాబట్టి వాట్సాప్ యూజర్లు ఇలాంటి మెసేజ్ లకు దూరంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే ఇలాంటి మెసేజ్ లు క్లిక్ చేసి నష్టపోయిన వారు కూడా ఇతరులకు ఈ విషయాన్ని తెలియచేయాలని కోరుతోంది.












Click it and Unblock the Notifications
