క్షుద్రపూజల కోసం మూడేళ్ల చిన్నారిని బలిచ్చిన మహిళ.. ఎక్కడంటే..?
ఓ వైపు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పలు రంగాల్లో దూసుకెళ్తున్నాయి. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) క్రమక్రమంగా విస్తరిస్తూ వస్తోంది. అయితే ఇలాంటి టెక్ యుగంలోనూ కొన్ని ప్రాంతాల్లో చేతబడులు, క్షుద్ర పూజలు లాంటి మూఢనమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. ఈ తాంత్రిక పూజల ద్వారా ఏదైనా లాభం పొందడం కోసం ఏకంగా ప్రాణాలనే బలి ఇస్తున్న ఘటనలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఉత్తర్ ప్రదేశ్ లోని బులాంద్ షహర్ ప్రాంతంలో జరిగింది. ఓ మహిళ క్షుద్రపూజల నెపంతో పొరుగింట్లోని ఓ మూడేళ్ల చిన్నారి ప్రాణాలను తీసింది. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఉత్తర్ ప్రదేశ్ బులాంద్ షహర్ ప్రాంతంలోని భుద్ ఏరియాలో శనివారం ఉదయం మూడేళ్ల చిన్నారి వనయ మిస్సింగ్ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. అప్పటి వరకూ ఇంటి ముందే ఆడుకున్న చిన్నారి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో బాలిక తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపం చెందారు. ఊరంతా గాలించారు. చిన్నారిని వెతికేందుకు వారి కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, గ్రామస్థులు కూడా సహకరించారు. కానీ వారికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. దాంతో ఆ కుటుంబం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఇక పోలీసులు రంగంలోకి దిగి అనేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చిన్నారి వనయ ఎక్కువ దూరం వెళ్లలేదని గ్రహించారు. దాంతో చిన్నారి ఇంటికి సమీపంలోని పరిసరాలు, ఇతర ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే పోలీసులు తీసుకొచ్చిన స్నిఫర్ డాగ్ సాయంతో ఓ ఇంట్లో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. చిన్నారి నోట్లో గుడ్డలు కుక్కి చేతిపై పదునైన ఆయుధంతో గాయం చేశారు. దాంతో రక్తం మొత్తం పోయి చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. ఇక క్షుద్ర పూజల నెపంతో బాలికను ఆ ఇంట్లోని మహిళ దారుణంగా చంపేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన నేపథ్యంలో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.












Click it and Unblock the Notifications
