ధనియా రైస్ ..లంచ్ బాక్స్ లో ఘుమఘుమ.. ఇలా చేస్తే అద్భుతః
ఉదయం పూట హడావుడిగా ఆఫీసులకు, కాలేజీలకు వెళ్లేవారికి త్వరగా సిద్ధమయ్యే, కడుపుకు హాయినిచ్చే అల్పాహారం ఉంటే ఎంతో బాగుంటుంది. చాలామందిని ఉదయాన్నే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటి వారికి ధనియాలు, జీలకర్ర, నెయ్యి, అన్నంతో నిమిషాల్లో తయారుచేసుకునే 'ధనియాల రైస్' చక్కని ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది. వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా, దీని రుచి, సువాసన ఇంటిల్లిపాదినీ ఆకట్టుకుంటాయి.
కావాల్సిన పదార్థాలు
అన్నం: 2 కప్పులు (పొడిపొడిగా ఉడికించినది)
ధనియాలు: 2 టేబుల్ స్పూన్లు (వేయించడానికి, పొడి చేయడానికి అనుగుణంగా)
ఎండుమిర్చి: 3 నుంచి 4 (కారానికి తగినట్లు)
జీలకర్ర: 1 టేబుల్ స్పూన్
శనగపప్పు, మినపప్పు: తగినంత (సుమారు 1 టేబుల్ స్పూన్ చొప్పున
వేరుశనగ పప్పు: 2 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు: 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: 2 రెమ్మలు
నెయ్యి, నూనె: రెండూ 2 టేబుల్ స్పూన్లు
పసుపు: పావు స్పూన్
ఉప్పు: రుచికి తగినంత

తయారీ విధానం
ముందుగా స్టవ్‌పై పాన్ పెట్టి ధనియాలు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చే వరకు సన్నని మంటపై వేయించాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మరీ నున్నగా కాకుండా కొద్దిగా బరకగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు అదే పాన్‌లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి వేడి చేయాలి. అది వేడయ్యాక శనగపప్పు, మినపప్పు, జీడిపప్పు, వేరుశనగ పప్పులు వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత కరివేపాకు, పసుపు వేసి కలపాలి.
తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పును ఈ పోపులో వేసి సుమారు ఒక నిమిషం పాటు కలపాలి. చివరగా ఉడికించి చల్లార్చిన అన్నాన్ని వేసి మసాలా పొడి, పోపు అన్నీ అన్నానికి బాగా పట్టేలా నెమ్మదిగా కలపాలి. ఘుమఘుమలాడే వేడివేడి ధనియాల రైస్ సిద్ధమైంది. కూరలు చేసుకునే తీరిక, సమయం లేనప్పుడు ఇలా చేసి తినండి.. మీకు బాగా నచ్చుతుంది. ఈ అన్నం మీ జీర్ణ శక్తిని కూడా పెంచుతుంది.













Click it and Unblock the Notifications
