పాలతో పాలకూర ఇలా వండండి - ఎంతో రుచిగా, సూపర్ గా
పాలకూర అంటే చాలా మందికి ఇష్టం. కానీ సాధారణంగా దాల్‌తో వండుతూ ఉంటాం. ఇప్పుడు ఒకసారి పాలతో కలిపి వండి చూడండి. మెత్తగా, క్రీమీగా, నోట్లో కరిగిపోయేలా రుచి వస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
పాలకూర - 2 కట్టలు
పాలు - 1 కప్పు
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 2 లేదా 3 (రుచికి తగ్గట్టు)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
జీలకర్ర - ½ టీస్పూన్
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి తగ్గట్టు
కారం - 1 స్పూన్
నూనె - 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర - కొద్దిగా

తయారీ విధానం
ముందుగా పాలకూరను బాగా కడగాలి. ఇసుక, మట్టి ఉండకుండా రెండు మూడు సార్లు కడిగి, నీళ్లు వడపోసి మెత్తగా తరిగి ఉంచుకోండి. ఒక పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయండి. జీలకర్ర వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు మగ్గనివ్వండి.ఇప్పుడు తరిగిన పాలకూర వేసి బాగా కలపండి.
పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి 4 నుంచి 5 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత కారం కూడా వేసి మళ్ళీ కూరను దగ్గరకు వచ్చేలా మగ్గించండి. పాలకూర మెత్తబడి నీళ్లు వచ్చేస్తుంది.అప్పుడు పాలు పోసి మరోసారి బాగా కలపండి. మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ 5 నుంచి 7 నిమిషాలు ఉడికించండి. పాలు కొద్దిగా గట్టిపడి కూర మెత్తగా, క్రీమీగా మారే వరకు వండాలి. చివర్లో కొత్తిమీర చల్లి దించేసుకోండి. అంతే పాలతో చేసిన పాలకూర రెడీ అవుతుంది.
పాలు ఎక్కువగా పోస్తే కూర ఎక్కువగా నీరుగా అవుతుంది. కాబట్టి మెత్తగా ఉండాలంటే పాలు కొద్దిగా పోస్తే మంచిది. కొంతమంది చివర్లో కొద్దిగా క్రీం లేదా పాల పొడి కలుపుతారు. అలా చేస్తే మరింత గట్టిగా, రుచిగా ఉంటుంది.పాలకూరను ముందుగా కొద్దిసేపు ఉడకబెట్టి, నీళ్లు వడపోసి తర్వాత వండితే రంగు ఆకుపచ్చగా ఉంటుంది.అలా కూడా చేసుకోవచ్చు. ఇది అన్నంతో కలిపి తినవచ్చు. లేదా రోటీ, పూరీలతో కూడా బాగుంటుంది.
పాలకూరలో ఇనుము, క్యాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. పాలు కలపడం వల్ల క్యాల్షియం ఇంకా పెరుగుతుంది. పిల్లలకు, గర్భిణులకు, వృద్ధులకు మంచి పోషకాహారం. రోజూ తింటే రక్తహీనత తగ్గడానికి, ఎముకల బలానికి సహాయపడుతుంది. అయితే మూత్రపిండాల సమస్య ఉన్నవారు ఎక్కువగా తినకూడదు.













Click it and Unblock the Notifications
