మూడు రోజుల్లోనే విధ్వంసం.. చిన్న సినిమా సంచలనం.. ఓవర్సీస్ లోనూ భారీ వసూళ్లు..!
టాలీవుడ్ లో యూత్ ను ఆకర్షించే సినిమాలు చాలానే వచ్చాయి. అయితే అలాంటి సినిమాలకు సీక్వెల్ వస్తే ఆ రచ్చ వేరేగా ఉంటుంది. అలాంటి సినిమాల్లో 'ఈ నగరానికి ఏమైంది' ఒకటి. 'పెళ్లిచూపులు' వంటి హిట్ తర్వాత కొత్తవాళ్లతో తరుణ్ భాస్కర్ ఈ సినిమాను తెరకెక్కించారు. 2018 లో వచ్చిన ఈ క్రైమ్ కామెడీ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డీ సురేష్ బాబు నిర్మించారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ వివేక్ గా.. సాయి సుశాంత్ రెడ్డి కార్తీక్ గా నటించారు. అలాగే అభినవ్ గోమటం కౌశిక్ గా.. వెంకటేశ్ కాకుమాను ఉపేంద్ర పాత్రలో అలరించారు. ఇక అలాగే అనీషా ఆంబ్రోస్, సిమ్రాన్ చౌదరి కీలక పాత్రలో నటించారు.
అయితే ఈ మూవీకి సీక్వెల్ గా వచ్చిన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది 2'.. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ విడుదలకు ముందే మంచి హైప్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే భారీ వసూళ్లు సాధించింది. ఈ మూవీ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.15.27 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ మూవీ రెండు రోజుల్లో రూ. 23.12 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. అలాగే మూడో రోజు ముగిసేసరికి ఈ మొత్తం రూ.32.22 కోట్లకు చేరుకున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఇక 'ఈ నగరానికి ఏమైంది 2' మూవీ ఓవర్సీస్ లో భారీ వసూళ్లు అందుకుంటోంది. అక్కడ ఈ సినిమాకు కలెక్షన్స్ 10 లక్షల డాలర్లకు పైగా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మీడియం రేంజ్ తెలుగు సినిమాలకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం గొప్ప విషయమనే చెప్పాలి. ఈ క్రమంలో విశ్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కాంబినేషన్ లో మరో హిట్ అందుకున్నట్లుగా భావించాలి. ఇక ఈ మూవీ రానున్న రోజుల్లో ఇంకెన్ని రికార్డుల్ని కొల్లగొడుతుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications
