సీఎం విజయ్ తగ్గేదే లేదు: సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్
మధురై జిల్లాలోని తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న వివాదాస్పద దీపత్తూన్ వద్ద కార్తీక దీపం వెలిగించడానికి అనుమతినిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 20న జారీ చేసిన ఉత్తర్వులను పునః సమీక్షించాలని కోరుతూ తమిళనాడు రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. నవంబర్ 24న అక్కడ దీపోత్సవం నిర్వహించడానికి ఇచ్చిన అనుమతిని సమీక్షించాలని విజ్ఞప్తి చేసింది.
దీపత్తూన్ వద్ద ఈ ఏడాదికి ఒక్కసారి మాత్రమే దీపాన్ని వెలిగించడానికి అనుమతిస్తూ సుప్రీంకోర్టు శుక్రవారమే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిద్వారా తిరుప్పరంకుండ్రంపై ఎలాంటి సంప్రదాయ, మతపర, యాజమాన్య హక్కులు ఏర్పడబోవని స్పష్టం చేసింది. భవిష్యత్తులో దీనిని ఒక ఉదాహరణగా గానీ, ఆనవాయితీగా గానీ పరిగణించడానికి కూడా వీల్లేదని తన ఆదేశాలలో స్పష్టమైన నిబంధన విధించింది.

ఈ నిబంధనల ప్రకారం దీపారాధన సమయంలో వివాదాస్పద ప్రాంతంలోకి ఆలయ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. సాధారణ భక్తులు గానీ, స్థానికులు గానీ వారితో వెళ్లడానికి అనుమతి ఉండదు. ఆ సమయంలో ఎలాంటి ఊరేగింపులు, ప్రదర్శనలు, ధర్నాలు, నినాదాలు చేయకూడదని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ మొత్తం ప్రక్రియను సమన్వయం చేయడానికి మధురై జిల్లా కలెక్టర్‌ను నోడల్ ఆఫీసర్‌గా సుప్రీంకోర్టు నియమించింది.
కొండపై కార్తీక దీపం ఎక్కడ వెలిగించాలనే అంశంపై ప్రధాన వివాదం నెలకొంది. కొండపై ఉన్న హజ్రత్ సుల్తాన్ సికిందర్ బాదుషా ఔలియా దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న 'దీపత్తూన్' అనే రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలని కొందరు కోరుతున్నారు. ఉచ్చి పిళ్లయార్ ఆలయం సమీపంలోని మంటపం వద్దే తరతరాలుగా దీపం వెలిగించే ఆచారం ఉందని, అక్కడ మాత్రమే కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ అని ఆలయ పరిపాలన విభాగం వాదిస్తోంది.
తిరుప్పరంకుండ్రం కొండపై దీపాన్ని వెలిగించడాన్ని వ్యతిరేకిస్తోంది తమిళనాడు ప్రభుత్వం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా గానీ అక్కడ దీపాన్ని వెలిగించడానికి సుముఖత చూపట్లేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేసింది. తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని అభ్యర్థించింది. దీపస్తంభం వద్ద దీపాలను వెలిగిస్తే స్థానికంగా శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడవచ్చనే విషయాన్ని ఇందులో పొందుపరిచింది.












Click it and Unblock the Notifications
