ఇన్‌ఫ్లుయెన్సర్ల మాట నమ్మి ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడిన బాలిక.. కిడ్నీలు పాడైన ఘటన!
ముఖం తెల్లగా మెరిసిపోవాలన్న ఆశ ఒక టీనేజీ అమ్మాయిని ఆసుపత్రి పాలు చేసింది. కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ప్రచారం చేసిన ఒక ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడి తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతోందని ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించిన ప్రకటనలు, వీడియోలు చూసి ఆకర్షితురాలైన ఆ బాలిక, అక్కడ ఇచ్చిన వాట్సాప్ నంబర్ ద్వారా విక్రేతలను సంప్రదించి క్రీమ్‌ను ఆర్డర్ చేసింది. సుమారు ఏడాది పాటు దానిని క్రమం తప్పకుండా వాడింది. తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో పరీక్షలు చేయించగా, ఆమె శరీరంలో పాదరసం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినట్టు తేలింది. దాని ఫలితంగా "మెంబ్రనస్ నెఫ్రోపతీ" అనే కిడ్నీ వ్యాధి వచ్చిందని వైద్యులు నిర్ధారించారు.

క్రీమ్‌ను ల్యాబ్‌లో పరీక్షించినప్పుడు కూడా అందులో అధిక మోతాదులో పాదరసం ఉన్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణ ఫలితాలు వస్తాయని, వేగంగా రంగు మెరుగవుతుందని చెప్పే ప్రకటనలను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ ఉదంతంపై వచ్చిన మీడియా కథనాల ఆధారంగా కేరళ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్వచ్ఛందంగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. బాధితురాలు తయారీదారుపై న్యాయపోరాటం చేయాలని కూడా భావిస్తోంది.
చర్మాన్ని త్వరగా తెల్లగా చేయడానికి కొన్ని నకిలీ లేదా నాణ్యత లేని క్రీముల్లో పాదరసం కలుపుతారు. ఇది చర్మం ద్వారా శరీరంలోకి చేరి కిడ్నీలు, నాడీ వ్యవస్థ వంటి అవయవాలను దెబ్బతీస్తుంది. తక్కువ మోతాదైనా నెలల తరబడి రోజూ వాడితే నష్టం జరగవచ్చు. కొన్నిసార్లు లక్షణాలు సంవత్సరాల తర్వాత కనిపిస్తాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పాకిస్థాన్ తయారీ గోరీ బ్యూటీ క్రీమ్ వాడిన 18 మంది మహిళలకు కిడ్నీ సమస్యలు వచ్చాయి. అందులో చట్టబద్ధ పరిమితి కన్నా వందల రెట్లు ఎక్కువ పాదరసం ఉందని తేలడంతో మహారాష్ట్ర ఎఫ్‌డిఎ దానిపై నిషేధం విధించింది. మినామాటా ఒప్పందం ప్రకారం సౌందర్య ఉత్పత్తుల్లో పాదరసం 1 పీపీఎం కన్నా ఎక్కువ ఉండకూడదు. కనుక బ్యూటీ క్రీములు కొనేవారు జాగ్రత్త.












Click it and Unblock the Notifications
