IIT: విద్యార్థి ఆత్మహత్య- ఫ్యాన్ రాడ్లు మార్చేస్తున్న ఐఐటీ..!
దేశంలోనే ప్రతిష్టాత్మక విద్య సంస్దలుగా పేరు తెచ్చుకున్న ఐఐటీల్లో సైతం విద్యార్ధుల ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రైవేటు కాలేజీల తరహాలో ఐఐటీల్లో సైతం విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఓ విద్యార్థి ఆత్మహత్య ఘటన ఎదుర్కొన్న ఓ ఐఐటీ.. తమ హాస్టళ్లలో ఫ్యాన్ రాడ్లను మారుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. దీంతో సమస్య పరిష్కారం అవుతుందా అని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు.
దేశంలోనే టాప్ ఐఐటీగా పేరున్న ఐఐటీ బోంబేలో (IIT Bombay) సాహిల్ వాకొడే అనే విద్యార్ధి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశమైంది. పరీక్ష హాల్లో మొబైల్ ఫోన్ వాడుతూ దొరికిపోయాడనే ఆరోపణల నేపథ్యంలో సాహిల్ తన రూమ్ లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై ఆగ్రహంగా ఉన్న విద్యార్ధులు నిరసనలకు దిగారు. వీరిని శాంతింపచేసేందుకు ఐఐటీ బోంబే తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు చర్యలు ప్రకటించిన అధికారులు.. తాజాగా ఓ కామెడీ నిర్ణయం తీసుకున్నారు. అది సాహిల్ ఆత్మహత్య చేసుకున్న హాస్టల్ 4లో ఫ్యాన్లకు ఉన్న రాడ్లను మార్పించడం.

ఇలా ఫ్యాన్లకు ఉన్న రాడ్లను మార్చడం ద్వారా విద్యార్ధులు ఆత్మహత్య చేసుకునే అవకాశం లేకుండా చేయాలనేది ఐఐటీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే విద్యార్ధులు మాత్రం ఐఐటీ నిర్ణయంపై పెదవి విరుస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్లను దశల వారీగా తొలగించి, ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఐఐటీ భావిస్తోంది. సెప్టెంబర్ 23న ఇలా ఐఐటీ సీలింగ్ ఫాన్ల రాడ్లను మార్చేందుకు తీసుకున్న నిర్ణయంపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ ఓ కథనం ప్రచురించింది. దీంతో అధికారులు సీలింగ్ ఫ్యాన్లకు బదులుగా గోడకు అమర్చే వాల్ ఫ్యాన్లను అమర్చుతున్నట్లు తెలుస్తోంది. దీంతో తమ మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయా అని విద్యార్ధులు ప్రశ్నిస్తున్నారు. అయితే భద్రత, హాస్టల్ మౌలిక సదుపాయాలు మెరుగుపర్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఇలా ఫాన్ల రాడ్లు మారుస్తున్నట్లు ఐఐటీ బోంబే విద్యార్ధులకు మెయిల్ పంపింది.














Click it and Unblock the Notifications
