హైదరాబాద్‌లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య !!
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఒక్కసారిగా విషాదం అలుముకుంది. ఎప్పటిలాగే ప్రశాంతంగా కనిపించిన ఓ అపార్ట్మెంట్లో ఆదివారం ఉదయం వెలుగుచూసిన ఘటన అందరినీ కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు, కుమారుడు అనుమానాస్పద పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయి కనిపించారు. గచ్చిబౌలి పరిధిలోని గౌలిదొడ్డిలో జరిగిన ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ముగ్గురి మృతికి దారితీసిన పరిస్థితులేంటి? అన్నది ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
గత ఏడాది నుంచి గౌలిదొడ్డిలోనే నివాసం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాలమూరు జిల్లా అచ్చంపేట మండలం తల్లాచెరువు గ్రామానికి చెందిన బత్తుల మర్రెడ్డి (65), ఆయన భార్య భారతి (60), కుమారుడు నిషాంత్ రెడ్డి (38) గత ఏడాది కాలంగా గౌలిదొడ్డిలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తున్నారు. అపార్ట్మెంట్లోని సి-బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702లో వీరు ఉంటున్నారు. నిషాంత్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది.

ఉదయం 8.40 గంటలకు వెలుగులోకి..
ఆదివారం ఉదయం సుమారు 8.40 గంటల సమయంలో ఫ్లాట్‌లో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్ కె. సైదులు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫ్లాట్‌ను పరిశీలించి ప్రాథమిక వివరాలు సేకరించారు.
ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలే కారణమా?
ముగ్గురూ ప్రాణాలు కోల్పోవడానికి గల అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే, గత కొంతకాలంగా కుటుంబ సభ్యులు ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ కలహాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. ఈ వివరాలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉంది.
అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ముగ్గురి మృతికి దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో వారి స్వగ్రామమైన తల్లాచెరువుతో పాటు అపార్ట్మెంట్ వాసుల్లోనూ విషాదం నెలకొంది.












Click it and Unblock the Notifications
