అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో మరో కీలక పెట్టుబడి.. రూ.2,790 కోట్లతో విస్తరణకు బూస్ట్
భారతదేశంలో విమానయాన మౌలిక వసతుల రంగాన్ని విస్తరించే క్రమంలో 'అదానీ ఎయిర్పోర్ట్ హోల్డింగ్స్ లిమిటెడ్' (AAHL) మరో ముఖ్యమైన ఆర్థిక మైలురాయిని చేరుకుంది. అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన AAHL, 360 వన్ ఆల్టర్నేట్స్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ నుంచి ₹2,790 కోట్ల (సుమారు 300 మిలియన్ డాలర్లు) నూతన ఈక్విటీ నిధులను సమీకరించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ తాజా పెట్టుబడితో సంస్థ ప్రీ-మనీ ఈక్విటీ విలువ సుమారు 18 బిలియన్ డాలర్లకు (రూ. 1.50 లక్షల కోట్లకు పైగా) చేరినట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ నూతన ఒప్పందంతో అదానీ ఎయిర్‌పోర్ట్స్ ఇప్పటివరకు సమీకరించిన మొత్తం ఈక్విటీ నిధుల పరిమాణం దాదాపు 1.35 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు మొదటి విడతలో ఆల్ఫా వేవ్ గ్లోబల్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, టెమాసెక్, బ్లాక్‌రాక్ నిర్వహణలోని నిధుల భాగస్వామ్యంతో కూడిన అంతర్జాతీయ, స్వదేశీ ఇన్వెస్టర్ల గ్రూప్ నుంచి కంపెనీ సుమారు ఒక బిలియన్ డాలర్లు (రూ. 9,825 కోట్లు) సమీకరించింది. తాజా ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ రెండు విడతల లావాదేవీలు పూర్తయిన తర్వాత AAHLలో ఇన్వెస్టర్ల ఉమ్మడి వాటా 7.01 శాతంగా ఉండనుంది.

ఒప్పందం ప్రకారంగా, 360 వన్ అసెట్ తమ నిధులు, అనుబంధ సంస్థల ద్వారా AAHL జారీ చేసే కొత్త ఈక్విటీ షేర్లను కొనుగోలు చేస్తుంది. మునుపటి ఇన్వెస్టర్లకు కేటాయించిన నిబంధనలు, వ్యాల్యుయేషన్ ప్రాతిపదికన ఈ షేర్ల జారీ ప్రక్రియ ఉంటుంది. దీనికి తోడుగా తొలి విడత ఇన్వెస్టర్లతో కుదుర్చుకున్న వాటాదారుల ఒప్పందానికి 360 వన్ అసెట్ కూడా ఆమోదం తెలిపిందని అదానీ ఎయిర్‌పోర్ట్స్ స్పష్టం చేసింది. అయితే ఈ లావాదేవీలు నియంత్రణ మండళ్ల అనుమతులకు లోబడి ఉంటాయి.
ప్రయాణికుల సామర్థ్యం రెట్టింపు చేసేందుకు విస్తరణ ప్రణాళికలు
సమీకరించిన నిధులను విమానాశ్రయాల ఆధునీకరణకు, మౌలిక వసతుల పెంపునకు వినియోగించాలని అదానీ గ్రూప్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఏటా దాదాపు 9.6 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సంస్థ, తమ వార్షిక ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని 20 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రస్తుత సామర్థ్యాన్ని రెట్టింపు చేయడం ద్వారా దేశీయ విమానయాన డిమాండ్‌ను అందుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎనిమిది ప్రధాన విమానాశ్రయాలను నిర్వహిస్తున్న ఈ సంస్థ, భారతీయ ప్రయాణికుల రాకపోకల్లో 23 శాతానికి పైగా వాటాను కలిగి ఉంది.
ఈ విస్తరణలో భాగంగా 'అదానీ ఎయిర్పోర్ట్ సిటీస్' అభివృద్ధిపై కంపెనీ ప్రత్యేక దృష్టి సారించనుంది. కేవలం ప్రయాణికులు వచ్చివెళ్లే కేంద్రాలుగానే కాకుండా విమానాశ్రయ పరిసర ప్రాంతాలలో వ్యాపార, వాణిజ్య సదుపాయాలు, రిటైల్ షాపింగ్, హోటళ్లు, లాజిస్టిక్స్ వంటి రంగాలను ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. దీనివల్ల ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందుబాటులోకి రావడమే కాకుండా, ఏరోనాటికల్ యేతర వ్యాపార రంగాలు విస్తరించి కంపెనీ వాణిజ్య రాబడి పెరిగేందుకు అవకాశాలు లభిస్తాయి.
భారత విమానయాన రంగానికి అంతర్జాతీయ గుర్తింపు
ఈ పెట్టుబడులపై అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీత్ అదానీ హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ, స్వదేశీ దిగ్గజ సంస్థల భాగస్వామ్యం భారత విమానయాన రంగానికి ఉన్న బలమైన వృద్ధి సామర్థ్యంపై ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. సాంప్రదాయ ట్రాన్సిట్ హబ్‌ల స్థానంలో ఇంటిగ్రేటెడ్ ఎయిర్పోర్ట్ సిటీలను నిర్మించడం వల్ల ప్రాంతీయ ఆర్థిక రంగానికి, వాణిజ్య రంగానికి బహుముఖ ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు.
దేశంలో విమాన ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతున్న తరుణంలో విమానాశ్రయాల నిర్వహణ, ఆధునీకరణ అత్యంత కీలకమైన అంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో లభించిన నూతన మూలధనం ద్వారా అదానీ గ్రూప్ తన నెట్వర్క్ పరిధిలోని విమానాశ్రయాలలో మౌలిక వసతులను బలోపేతం చేస్తూ, విమానయాన రంగంలో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశం ఏర్పడింది.












Click it and Unblock the Notifications
