బ్లాక్ ఫ్రైడే సేల్ లో షాపింగ్.. ఇలా చేయకపోతే మీ బ్యాంక్ ఖాతా క్షణాల్లో ఖాళీ..!
ప్రతి ఏడాది థాంక్స్ గివింగ్ సెలవు రోజును మరునాడు వచ్చే బ్లాక్ ఫ్రైడే రోజు పెద్ద ఎత్తున షాపింగ్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఈ ఏడాది ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్ ఇవాళ ప్రారంభమైంది. ఈ భారీ సేల్ లో చాలా రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్, ఆఫర్స్ అందిస్తుంది. ఈ ఏడాది కొత్త గాడ్జెట్‌లు, ఇంటి సామాన్లు కొనుక్కోవడానికి లేదా అవసరమైనవి షాపింగ్ చేయడానికి ఇదే మంచి ఛాన్స్ అని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇదే సమయంలో భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. నకిలీ వెబ్ సైట్లు, ఫిషింగ్ లింకులు, ఫేక్ క్యూఆర్ కోడ్లతో ప్రజల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేందుకు పలు రకాలుగా పన్నాగాలు పన్నుతున్నట్లు సమాచారం అందుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తం అయింది. బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్స్ లో కనిపించే ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, నమ్మశక్యం కాని ఆఫర్ల విషయంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ కీలక సూచనలు చేశారు. షాపింగ్ రద్దీని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు ఫేక్ వెబ్ సైట్లతో పాటు మోసపూరితమైన ప్రకటనలు.. ఫిషింగ్ లింక్స్ ద్వారా ప్రజల నగదును.. బ్యాంకింగ్ వివరాలను రాబట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తుంటారని తెలిపారు. ఈ మేరకు వాట్సాప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో విస్తృతంగా షేర్ అవుతున్న అనుమానాస్పద లింకులపైన క్లిక్ చేయవద్దని కీలక సూచనలు చేశారు.

మోసాల బారిన పడకుండా ఉండేందుకు నమ్మకమైన ప్లాట్ ఫామ్ లనే ఎంచుకోవాలని సూచించారు. ఏదైనా లింక్ పై క్లిక్ చేసే ముందు వెబ్ సైట్ URL ను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోవాలని అన్నారు. ఇక నమ్మశక్యం కాని ఆఫర్లకు ఆశపడొద్దని తెలిపారు. అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్ లకు దూరంగా ఉండటమే మేలని వివరించారు.












Click it and Unblock the Notifications
