పోక్సో కేసులో ప్రముఖ నటుడికి ఏడాది జైలు.. సినీ పరిశ్రమ షాక్..
మలయాళం ప్రముఖ నటుడు శ్రీజిత్ రవికి పోక్సో కేసులో ఏడాది జైలుశిక్షను విధించింది కేరళ కోర్టు. ఏడాది కఠినకారాగార శిక్షతో పాటు రూ. 50 వేలు జరిమానా కూడా విధించింది. 2022 లో ఆయనపై పోక్సో కేసు నమోదైంది. విచారణలో భాగంగా కేరళలోని త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులోని జడ్జి రమ్యా మీనన్ తాజాగా తీర్పును వెల్లడించారు.
ఐపీసీ సెక్షన్ 509 తో పాటు పోక్సో కేసులోని సెక్షన్ 11(i) ఆధారంగా నటుడు శ్రీజిత్ రవికి శిక్ష పడింది. అయితే త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పుపై శ్రీజిత్ రవి కీలక నిర్ణయం తీసుకున్నారు. కోర్టు తీర్పును కేరళ హైకోర్టులో సవాల్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు అప్పీల్ చేసుకునేందుకు వీలుగా త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు శిక్షను ఒక నెల రోజులపాటు సస్పెండ్ చేసింది. అలాగే శ్రీజిత్ రవికి బెయిల్ మంజూరు చేసింది.
ఇక కేసు విషయానికి వస్తే.. 2022 జూలై 4న త్రిస్సూర్ లోని ఓ గ్రౌండ్ సమీపంలో శ్రీజిత్ రవి.. స్కూల్ విద్యార్థుల ఎదుట అసభ్యంగా ప్రవర్తించారని అంటే బహిరంగ ప్రదేశాల్లో ఇండీసెంట్ ఎక్స్‌పోజర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇద్దరు చిన్నారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

అనంతరం ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి శ్రీజిత్ రవిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు విచారణలో మొత్తం 21 మంది సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేశారు. అయితే ఆ సమయంలో శ్రీజిత్ రవి బిహేవియరల్ డిజార్డర్ అనే మానసిక సమస్యతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ క్రమంలో కేరళ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఇక నాలుగేళ్ల విచారణ అనంతరం త్రిస్సూర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తాజాగా తీర్పును వెల్లడించింది. ఇక శ్రీజిత్ రవి మలయాళంలో 70 కు పైగా చిత్రాల్లో నటించారు. మలయాళం అలనాటి ప్రముఖ నటుడు టీజీ రవి కుమారుడే శ్రీజిత్ రవి.












Click it and Unblock the Notifications
