అర్ధరాత్రి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడికి షాక్ ఇచ్చిన కేంద్రం
కాక్రోచ్ జనతా పార్టీ కోకన్వీనర్ సౌరవ్ దాస్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను అడ్డుకున్నారు. విదేశీ ప్రయాణానికి అనుమతి ఇవ్వలేదు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఎడిన్ బర్గ్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి యూనివర్శిటీల్లో కొన్ని కార్యక్రమాలకు ఆయన హాజరు కావడానికి లండన్ వెళ్తోండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అర్ధరాత్రి వేళ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనను విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు.
ఇందిరాగాందీ ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద సౌరవ్ దాస్ పాస్‌పోర్ట్‌ను అధికారులు పరిశీలించారు. ఆయన పాస్‌పోర్ట్ నిఘా జాబితాలో ఉందనే కారణంతో విమానం ఎక్కకుండా అడ్డుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ నిర్వహించిన ప్యానెల్ చర్చలో పాల్గొనేందుకు తాను బయలుదేరి వెళ్తోన్నానని సౌరవ్ దాస్ వెల్లడించినప్పటికీ.. అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి ముందస్తు నోటీస్ గానీ, స్పష్టమైన కారణం గానీ చెప్పకుండా విమానాశ్రయంలోనే అడ్డుకోవడంపై అసహనం వ్యక్తం చేశారు.

దేశ యువత అంతర్జాతీయ వేదికలపై మాట్లాడటాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని ఎద్దేవా చేశారు సౌరవ్ దాస్. బ్యాంకులను నిండా ముంచి వేల కోట్ల రూపాయలతో విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటి ఆర్థిక నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోలేని కేంద్ర ప్రభుత్వం.. మేధోపరమైన చర్చల్లో పాల్గొనే యువతపై ఆంక్షలు విధించడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో విద్యార్థులు, విద్యావేత్తల గొంతు నొక్కడం సహేతుకం కాదని చెప్పారు.
కేంద్రం తన ప్రయాణాన్ని తాత్కాలికంగా అడ్డుకున్నప్పటికీ, తన భావజాలాన్ని వ్యాప్తి చేయడాన్ని గానీ, అంతర్జాతీయ పర్యటనలను గానీ ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోలేదని, భవిష్యత్తులో లండన్, పారిస్ వంటి నగరాల్లో జరిగే సదస్సులకు తప్పకుండా హాజరవుతానని ధీమా వ్యక్తం చేశారు. పాస్‌పోర్ట్‌ను ఎందుకు ఫ్లాగ్ చేశారనే అంశంపై ఇమ్మిగ్రేషన్ విభాగం లేదా సంబంధిత ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా స్పష్టమైన అధికారిక వివరణ రావలసి ఉందని పేర్కొన్నారు.
ఈ పరిణామంపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సైతం ఘాటుగా స్పందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఆక్స్‌ఫర్డ్ వంటి ప్రసిద్ధ యూనివర్శిటీల నుంచి సౌరవ్ దాస్‌కు ఆహ్వానం లభించడాన్ని సహించలేక కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. విదేశీ పర్యటనల కోసం ఎగబడే కేంద్ర ప్రభుత్వ పెద్దలు.. విద్యాసంబంధిత కార్యక్రమాలకు వెళ్లే యువ నాయకుడిని అడ్డుకోవడం రాజకీయ అసూయకు నిదర్శనమని విమర్శించారు.












Click it and Unblock the Notifications
