Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..?
ఒక ఊరిలో రామయ్య అనే పెద్దాయన ఉండేవాడు. ఆయనకు ముగ్గురు కుమారులు నవీన్, పవన్, కిరణ్ ఉండేవారు. వాళ్లందరికీ వివాహాలు జరిగాయి. అయితే మొదట్లో ఆ ఉమ్మడి కుటుంబం మొత్తం పిల్లాపాపలతో సంతోషంగా జీవించేవారు. కాలక్రమేణా ఆ కుటుంబంలో గొడవలు, మనస్పర్థలు రావడం జరిగాయి. వంటింటి ఖర్చులు, పంటల దిగుబడి విషయాల్లో ముగ్గురు కుమారుల మధ్య విభేదాలు తలెత్తసాగాయి. ఇక కోడళ్లు కూడా చిన్న చిన్న విషయాలకే తగాదాలు పడటం జరుగుతూ ఉండేవి. క్రమంగా తన తండ్రి సలహాలను కూడా గతంలో మాదిరిగా పట్టించుకోవడం మానేశారు ఆ ముగ్గురు కుమారులు. ఇక కుటుంబ కలహాలను ప్రతి రోజూ రామయ్య గమనిస్తూ ఉండేవాడు. అప్పట్లో కుటుంబం ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా మారిందని బాధపడుతూ ఉండేవాడు.
అయితే ఓ రోజు ఇంటి యజమాని రామయ్య ఇంటి ముందు ఉన్న పెద్ద మామిడి చెట్టు కింద కూర్చుని పేపర్ చదువుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆయన వద్దకు పెద్ద కుమారుడు నవీన్ వచ్చాడు. " నాన్నా.. ఇలా రోజూ ఇంట్లో గొడవలు పడుతూ ఉండలేకపోతున్నాం. నా వాటా నాకు ఇస్తే నేను వేరేగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నాను" అని అంటాడు. నవీన్ మాటలను అతని సోదరుడు పవన్ సమర్థించాడు. "అవును నాన్నా.. ఇలా గొడవలు పడుతూ ఎలా ఉండగలం అని తెలిపాడు" ఇక మూడో కుమారుడు కిరణ్ వచ్చి.." మీ మాటలకు గౌరవం ఇచ్చి ఇన్నాళ్లూ నేను మౌనంగా ఉన్నాను. కానీ నేను ఇలా ఉండలేను" అని తెలిపాడు.
ఇక ముగ్గురు కుమారుల మాటలకు ఓపికగా విన్న తండ్రి రామయ్య.." కుమారులారా.. మీరు ఇలా జీవించాలని అనుకుంటే నేను కాదనను. కానీ నాకు ఓ కోరిక తీరుస్తారా..? అని అడిగాడు. దానికి కుమారులు సరే అన్నారు. దాంతో ఆ పెద్దాయన ఇంట్లోకి వెళ్లి మూడు పాత ఇత్తడి పళ్లేలను తీసుకొచ్చాడు. వాటిని విరగొట్టండని అన్నాడు. తండ్రి మాటను కాదనలేక ఆ మూడు పళ్లేలను కింద పడేటి పగుల గొట్టారు. అప్పుడు తండ్రి.. పగిలిన ఆ పళ్లేలను తిరిగి కలిపి ఇంతకుముందు ఎలా ఉన్నాయో అలాగే తయారు చేయాలని అన్నాడు. అయితే అందుకు ముగ్గురు కుమారులు ఎంత ప్రయత్నించినా సాధ్య పడలేదు.
అప్పుడు తండ్రి ఆవేదనతో ఇలా అన్నాడు. " కుమారులారా.. మన కుటుంబం కూడా ఇలాంటి పళ్లెం లాంటిదే. కోపంతో తీసుకునే నిర్ణయాల కారణంగా ఒకసారి కుటుంబం ముక్కలైతే ఆ తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మళ్లీ మునుపటిలా కలవలేవు. ఒకవేళ అతికించినా ఆ బాధ, గీతలు జీవితాంతం అలాగే మిగిలిపోతాయి" అని రామయ్య అన్నాడు. ఇక తమ తప్పు తెలుసుకున్న కుమారులు తండ్రికి క్షమాపణలు చెప్పి.. ఇకపై ఎప్పటికీ విడిపోకుండా కలిసిమెలిసి ఉంటామని తెలిపారు.

నీతి: కోపం, అహంకారంతో తీసుకునే తొందరపాటు నిర్ణయాలు విలువైన బంధాలను శాశ్వతంగా విడదీస్తాయి. ఐకమత్యం శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది.. కానీ విడిపోవడం మాత్రం మనసుల్లో చెరగని గాయాలను మిగిలిస్తుంది.












Click it and Unblock the Notifications
