నేడు కార్తీక పౌర్ణమి- భరణీ దీప దర్శనంతో పులకించిన అరుణాచలం
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వర ఆలయంలో వార్షిక కార్తికదీపం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభం అయ్యాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన భరణి దీపాన్ని గర్భగుడిలో అర్చకులు శాస్త్రోక్తంగా వెలిగించారు. ఈ తెల్లవారుజామున 4 గంటలకు భక్తిశ్రద్ధలతో ఈ క్రతువును నిర్వహించారు. దీన్ని దర్శించుకోవడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా హరోహర నినాదాలతో పులకించింది.
కార్తీక దీపోత్సవంలో భరణి దీపారాధనకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఆలయ ప్రధాన అర్చకులు వేద మంత్రోచ్ఛారణలు చేస్తోండగా, ఏకకాలంలో అయిదు వేర్వేరు ప్రమిదలలో జ్యోతులను వెలిగించారు. అనంతరం వీటన్నింటినీ ఒక్కటిగా కలిపి భరణి దీపాన్ని ఆవిష్కరించారు. ఈ పవిత్ర జ్యోతిని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుందని, సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

కార్తీక పున్నమి చంద్రుడి వెలుగుల్లో ఈ సాయంత్రం అరుణగిరిపై వెలిగించే మహాదీపానికి ఈ భరణీ దీపాన్ని ప్రారంభ సూచికగా భావిస్తారు. భరణి దీపోత్సవం విజయవంతంగా పూర్తయిన తర్వాత, సాయంత్రం వేళ అరుణాచల కొండ శిఖరంపై అత్యంత వైభవంగా 'మహాదీపం' వెలిగిస్తారు. దీనికి విస్తృత ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సముద్ర మట్టానికి దాదాపు 2,668 అడుగుల ఎత్తులో ఉన్న కొండపై ఒక విశాలమైన రాగి కొప్పెరలో వేల కిలోల నెయ్యి, కాటన్ వత్తులతో ఈ దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. ఈ మహాదీపం వెలుగులు చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్ల పరిధి వరకు స్పష్టంగా కనిపిస్తాయి.
భరణీ దీపోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ మహాదేవన్, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి ఎస్ రమేష్, తిరువణ్ణామలై జిల్లా కలెక్టర్ వందనా గర్గ్, పోలూర్ టీవీకే ఎమ్మెల్యే అభిషేక్ తదితరులు దీనికి హాజరయ్యారు. ప్రముఖుల రాకతో పాటు వేలాదిగా తరలివచ్చిన సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
#WATCH | Tiruvannamalai, Tamil Nadu: The Bharani Deepam was lit at the Arunachaleswarar Temple in Tiruvannamalai as part of the annual Karthigai Deepam festival ahead of Maha Deepam. The holy ritual was witnessed by devotees. Tamil Nadu Hindu Religious and Charitable Endowments (HR&CE) Minister S Ramesh, Supreme Court Justice R Mahadevan, District Collector Vandana Garg, and Polur TVK MLA Abhishek were also seen participating.
— ANI (@ANI) November 23, 2026
అరుణాచలేశ్వర ఆలయం పంచభూత లింగాలలో అగ్ని తత్వానికి ప్రతీక. ఇక్కడ కార్తిక మాసంలో వెలిగించే దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది. మహాదీపం వెలిగే శుభ సమయంలో భక్తులు అరుణాచల కొండ చుట్టూ 14 కిలోమీటర్ల మేర గిరిప్రదక్షిణ చేయడం శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. ఈ పవిత్ర గిరిప్రదక్షిణ మార్గంలో నడుస్తూ స్వామివారిని స్మరించుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు అభీష్టసిద్ధి లభిస్తుందని భక్తులు బలంగా విశ్వసిస్తారు.












Click it and Unblock the Notifications
