మళ్లీ టారిఫ్ ల మోత మోగించబోతున్న ట్రంప్..! భారత్ సహా పలు దేశాలకు షాక్?
అమెరికా తన వాణిజ్య భాగస్వాములుగా ఉన్న పలు దేశాలపై సుంకాల మోత (US Tariff) మోగించేందుకు సిద్దమవుతోంది. ఇందులో భారత్, చైనాతో పాటు పలు దేశాలున్నాయి. వీటిలో భారత్ సహా మొత్తం ఏడు దేశాలపై ఓ విధంగా, చైనాపై మరో విధంగా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా ఏయే దేశంపై ఎంతెంత సుంకాలు విధించబోతున్నారనే అంశంపై అమెరికా ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.
రాయిటర్స్ కథనం ప్రకారం యూఎస్ ట్రేడ్ రెప్రజెంటేటివ్ తాజా ప్రణాళిక కింద భారత్ సహా మొత్తం ఏడు దేశాలపై అమెరికా 25 శాతం వరకూ సుంకాలు విధించబోతోంది. ఇందులో భారత్ తో పాటు కంబోడియా, ఇండోనేషియా, దక్షిణకొరియా, మలేషియా, తైవాన్, థాయిలాండ్ ఉన్నాయి. ఇవి కాకుండా చైనాపై ఏకంగా 40 శాతం టారిఫ్ విధించబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 16 ఆర్ధిక వ్యవస్థల వాణిజ్య విధానాలపై ఎనిమిది నెలల పాటు అమెరికా జరిపిన దర్యాప్తు తర్వాత ఈ ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. ఆయా దేశాలు తమ మార్కెట్ డిమాండ్ ను మించి తయారీ, ఉత్పత్తి స్ధాయిలకు మద్దతిస్తున్నాయని, తద్వారా తమ వ్యాపారాలపై ఒత్తిడి తెస్తున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. దీంతో తయారీ రంగంలో అదనపు సామర్ధ్యం, ఉత్పత్తి చేసే దేశాల్ని టార్గెట్ చేసుకుంది.

భారత్ సహా ఈ దేశాలన్నీ తమ మార్కెట్ డిమాండ్ కు మించి పారిశ్రామిక సామర్ధ్యాన్ని పెంచుకుని అమెరికాకు నష్టం చేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ భావిస్తోంది. అందుకే వీటి వస్తువులపై భారీ సుంకాలు విధించడం ద్వారా ఆయా దేశాల్ని కట్టడి చేయాలని యోచిస్తోంది. అమెరికా ఇలా దర్యాప్తు చేసిన దేశాల్లో జపాన్, దక్షిణకొరియా, యూరోపియన్ యూనియన్, అమెరికా మిత్రదేశాలతో పాటు భారత్ ను కూడా చేర్చారు. తాజా ప్రణాళిక ప్రకారం వియత్నాం 35 శాతం, యూరోపియన్ యూనియన్ 27 శాతం, జపాన్, స్విట్లర్లాండ్, సింగపూర్, బంగ్లాదేశ్ 20 శాతం వరకూ అమెరికా సుంకాలు ఎదుర్కునే అవకాశం ఉంది. మరోవైపు భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదురుతుందని భావిస్తున్న తరుణంలో ఈ సుంకాల మోత దానికి అడ్డంకులు కల్పించే ప్రమాదం ఉంది.













Click it and Unblock the Notifications
