‘మైటీడీపీ’ సరికొత్త చరిత్ర!- ఏకంగా 10 లక్షల మార్కు దాటి..!
ప్రాంతీయ రాజకీయ పార్టీల డిజిటల్ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ (TDP) అరుదైన మైలురాయి దాటింది. క్షేత్రస్థాయిలో కార్యకర్త కష్టానికి గుర్తింపు, కష్టపడిన వారికి పదవులు, కార్యకర్త నుంచి అధినేత వరకు నేరుగా అనుసంధానమే లక్ష్యంగా కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునేందుకు మైటీడీపీ మొబైల్ యాప్ పేరుతో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసిన ఆ పార్టీ.. ఇప్పుడు 10 లక్షల మంది కార్యకర్తలతో రిజిస్ట్రేషన్లు చేయించి సరికొత్త రికార్డు నెలకొల్పింది.
ఒకప్పుడు మారుమూల గ్రామంలో పార్టీ జెండా మోసే కార్యకర్త పడిన కష్టం పార్టీ అధిష్ఠానానికి తెలియడం అంత సులభం అయ్యేది కాదు. ఆ పరిస్థితిని 'మైటీడీపీ' యాప్ మార్చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆలోచనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పించేందుకు ఈ యాప్‌ను రూపొందించారు. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలు, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసే కార్యక్రమాలు, ఎన్నికల ప్రచారం, సేవా కార్యక్రమాల వివరాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఏ కార్యకర్త ఎంత చురుగ్గా పనిచేస్తున్నారనే విషయం నేరుగా పార్టీ నాయకత్వానికి తెలుస్తోంది.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతోమంది సాధారణ కార్యకర్తలకు కార్పొరేటర్లు, సర్పంచులుగా అవకాశాలు లభించాయి. పార్టీ, నామినేటెడ్ పదవుల్లోనూ కష్టపడిన కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కుతోంది. అటువంటి కార్యకర్తలను గుర్తించడంలో 'మైటీడీపీ' యాప్ ద్వారా అందుతున్న పనితీరు వివరాలు కీలకంగా మారాయి. పార్టీ అధినేత సందేశాలు, నాయకత్వం ఇచ్చే సూచనలు, పార్టీ కార్యక్రమాల వివరాలు క్షణాల్లో కార్యకర్తలకు చేరుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, సమస్యలు నేరుగా పార్టీ నాయకత్వానికి చేరుతున్నాయి. పార్టీ కార్యక్రమాలపై కార్యకర్తల స్పందనను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు వారి సూచనలకు ప్రాధాన్యం ఇచ్చేలా యాప్‌ను రూపొందించారు. కార్యకర్తలకు సమాచారం అందించడమే కాకుండా, కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించే సమగ్ర డిజిటల్ వ్యవస్థగా 'మైటీడీపీ' పనిచేస్తోంది.కార్యకర్తల సమావేశాలు, శిక్షణా తరగతులు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణలోనూ 'మైటీడీపీ' కీలక పాత్ర పోషిస్తోంది.
పార్టీ అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు. సమావేశాలకు హాజరైన కార్యకర్తలతో ఫొటోలు దిగుతున్నారు. ఆ ఫొటోలను 'మైటీడీపీ' యాప్ ద్వారా నేరుగా కార్యకర్తలకు అందించేలా ప్రత్యేక సదుపాయం కల్పించారు. కార్యకర్తలు ఒక్కసారి యాప్‌లో తమ ముఖాన్ని స్కాన్ చేసుకుంటే చాలు... ఆ తర్వాత పార్టీ అధినేతతో, నారా లోకేష్‌తో ఎప్పుడు ఫొటో దిగినా, సంబంధిత ఫొటోలు యాప్‌లోని 'ఫొటో బూత్' విభాగంలోకి నేరుగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ సదుపాయం కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 'మైటీడీపీ' యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. నారా లోకేష్ నియోజకవర్గాల పర్యటనల సందర్భంగా యాప్ ద్వారా అప్పగించిన కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసిన కార్యకర్తలను గుర్తించి, వారికి ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనే భరోసాను కల్పిస్తున్నారు.

కార్యకర్తే అధినేత.. కార్యకర్తే తెలుగుదేశం పార్టీకి బలం..బలగం. పార్టీకి, కార్యకర్తకు మధ్య డిజిటల్ వారధిగా రూపొందించిన ‘మైటీడీపీ’ యాప్‌లో నమోదైన మన కుటుంబ సభ్యుల సంఖ్య 10 లక్షలకు చేరుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే ప్రతి కష్టానికీ గుర్తింపు లభించాలి. ప్రతి కార్యకర్త అభిప్రాయానికీ విలువ ఉండాలి. పార్టీ కోసం కష్టపడే వారికి సముచిత అవకాశాలు దక్కాలి. ఈ లక్ష్యంతోనే మైటీడీపీ యాప్‌కు శ్రీకారం చుట్టాం. ఈ ప్రయాణంలో భాగస్వాములైన 10 లక్షల మంది తెలుగుదేశం కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు.@MyTDPOfficial
— Lokesh Nara (@naralokesh) November 25, 2026
రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తల నుంచి 'మైటీడీపీ' యాప్‌కు విశేష స్పందన లభిస్తోంది. యాప్ వినియోగం, పార్టీ కార్యక్రమాల నమోదులో
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే నరసరావుపేట, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, గుంటూరు, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే కుప్పం, వినుకొండ, కనిగిరి, మంగళగిరి, గన్నవరం టాప్ 5లో నిలిచాయి. దేశంలో అనేక రాజకీయ పార్టీలకు డిజిటల్ వేదికలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కార్యకర్త పడే కష్టాన్ని గుర్తించడం, వారి పనితీరును తెలుసుకోవడం, అభిప్రాయాలను నేరుగా సేకరించడం, ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించడం వంటి ప్రత్యేకతలతో 'మైటీడీపీ' యాప్‌ను తీర్చిదిద్దారు. కేవలం పార్టీ సమాచారాన్ని కార్యకర్తలకు చేరవేసే వేదికగా కాకుండా, కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధికి ఉపయోగపడే సమగ్ర డిజిటల్ వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారు. 'మైటీడీపీ' యాప్‌లో 10 లక్షల మంది నమోదు చేసుకోవడం కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు. పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న అంకితభావానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో వారి చైతన్యానికి నిదర్శనంగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి.














Click it and Unblock the Notifications
