బౌలర్ ఎవరైనా బాదుడే.. వైభవ్ బ్యాటింగ్ వెనుక అసలు టాలెంట్ ఇదే!
యూఏఈపై కేవలం 53 బంతుల్లో 204 పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీని చూసి బలహీనమైన ప్రత్యర్థిపై కొడితే గొప్పేముందనే ప్రశ్న కొందరిలో తలెత్తవచ్చు. కానీ 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేయడం నిజంగా అంత సులభమా? ఎవరైనా ఇలా చేయగలరా? ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ షో "ది స్విచ్"లో వైభవ్ సూర్యవంశీ తన దూకుడైన హిట్టింగ్ సత్తాను ముందే నిరూపించుకున్నాడు. వైభవ్ సూర్యవంశీ విధ్వంసం ప్రతి ఒక్కరికీ ఎందుకు సాధ్యం కాదో విశ్లేషిద్దాం.
రికార్డులను తిరగరాసిన విధ్వంసం
యూఏఈపై వైభవ్ సూర్యవంశీ ఆడిన 53 బంతుల 204 పరుగుల ఇన్నింగ్స్ క్రికెట్ రికార్డుల పుస్తకాలను కదిలించింది. 52 బంతుల్లో డబుల్ సెంచరీ, 28 బంతుల్లో సెంచరీ సాధించి ఒకే ఇన్నింగ్స్‌లో లిస్ట్-ఏ క్రికెట్లోని అనేక భారీ రికార్డులను బ్రేక్ చేశాడు. కేవలం 28 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. గతంలో ఆస్ట్రేలియా ఆటగాడు జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్(2023-24లో 29 బంతులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఆ తర్వాత 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి న్యూజిలాండ్ జట్టుకు చెందిన చాడ్ బోవ్స్(103 బంతులు) రికార్డును 51 బంతుల తేడాతో చెరిపేశాడు.

విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై 59 బంతుల్లో 150 పరుగులు చేసిన తన సొంత రికార్డును యూఏఈపై మరింత వేగంగా అధిగమించాడు. అలాగే ఈ ఏడాది ఇండియా-ఏ ముక్కోణపు సిరీస్ ఫైనల్లో 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది.. లిస్ట్-ఏలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రత్యర్థి బలం క్రికెట్లో ముఖ్యమే అయినప్పటికీ.. బలహీనమైన జట్టుపై ఎవరుపడితే వారు ఇలా డబుల్ సెంచరీ కొట్టలేరు. అందుకు అసాధారణ టైమింగ్, బంతిని అంచనా వేసే నైపుణ్యం, షాట్లపై కంట్రోల్, వరుసగా భారీ షాట్లు ఆడే సత్తా అవసరం. వైభవ్ సూర్యవంశీ ఈ లక్షణాలన్నింటినీ ప్రదర్శించాడు. బలహీన జట్టుపై కొట్టారనే వారికి ఒకటే ప్రశ్న. అంత సులభమైతే మీరూ బ్యాట్ పట్టి 50-55 బంతుల్లో 200 పరుగులు చేసి చూపించిండి. మ్యాచ్ సంగతి పక్కన పెడితే ప్రాక్టీస్‌లో కూడా ఇలాంటి విధ్వంసం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు.
పీటర్సన్ షోలోనూ మెరుపులు
వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ ను కేవలం యూఏఈ మ్యాచ్‌కే పరిమితం చేసి చూడకూడదు. కెవిన్ పీటర్సన్ నిర్వహించే 'ది స్విచ్' షోలోనూ అతని హిట్టింగ్ పవర్ కనిపించింది. 50 బంతుల్లో 100 పరుగులు చేయాలనే సవాల్‌ను వైభవ్ సూర్యవంశీకి ఇచ్చారు. ఇందులో ప్రతి బంతికి వేగం ఓ మైలు చొప్పున పెరుగుతూ పోతుంది. బంతివేగం పెరుగుతున్నా వైభవ్ సూర్యవంశీ ఆటతీరులో తగ్గుదల కనిపించలేదు. తొలి 10 బంతుల్లోనే 8 సిక్సర్లతో సహా 53 పరుగులు బాదాడు. క్యాచ్ పడితే బహుమతి ఇస్తామని ప్రకటించినా వైభవ్ దూకుడు ఆగలేదు. 14 సిక్సర్లు, 25కు పైగా బౌండరీలతో కేవలం 25 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఇది అధికారిక మ్యాచ్ కాకపోయినా ప్రాక్టీస్ తరహా వాతావరణంలోనూ వేగవంతమైన బంతులను భారీ షాట్లుగా మలిచే సత్తా అతనికి ఉందని స్పష్టమైంది.
తరానికొక్కడు..
వైభవ్ సూర్యవంశీ వయస్సు కేవలం 15 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయస్సులో అతను నెలకొల్పిన రికార్డులు ఆశ్చర్యం కలిగిస్తాయి. బౌలర్ అనుభవం, బంతి వేగంతో సంబంధం లేకుండా నిర్భయంగా ఆడటం అతని ప్రత్యేకత. అయితే వైభవ్ ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీలు, డబుల్ సెంచరీలు చేస్తాడని కాదు. కష్టమైన రోజులు వస్తాయి. పెద్ద స్థాయిలో బౌలర్లు అతని బలహీనతలను లక్ష్యంగా చేసుకుంటారు. కానీ ఒకటి రెండు ఇన్నింగ్స్‌లతో యువ ఆటగాడిని అంచనా వేయకూడదు. కనీసం ఆరు మ్యాచ్‌ల పాటు వరుసగా అవకాశాలు ఇచ్చి అతని ప్రతిభను తీర్చిదిద్దాలి. తరానికి ఒకరు మాత్రమే ఇలా చిన్న వయసులోనే క్రికెట్ ప్రమాణాలకు సవాల్ విసురుతారు.














Click it and Unblock the Notifications
