తిరుమల చేరిన 121 కిలోల బంగారం, శ్రీవారి ఆభరణాలివీ - నేడే.. ఎవరీ భక్తుడు..!!
తిరుమల శ్రీవారికి 121 కేజీల స్వర్ణాభరణాల సెట్ కానుకగా అందనుంది. తిరుమల చరిత్రలో ఇంత పెద్ద మొత్తం కానుక ఇదే తొలి సారి. చెన్నైకు చెందిన ఓ ఎన్నారై సుమారు 160 కోట్ల రూపాయల విలువైన 121 కేజీల బంగారు ఆభరణాలను విరాళంగా సమర్పించనున్నారు. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ కార్యక్రమం జరగనుంది. కిరీటం, పాదుకలు, సాలగ్రామ హారాలతో కూడిన మొత్తం 45 రకాల ఆభరణాలను ప్రత్యేకంగా రూపొందించి 9 సెట్లుగా ట్రక్కులో తిరుమలకు తీసుకువచ్చారు. దీంతో.. ఆ భక్తుడి వివరాల పైన ఆసక్తి నెలకొంది.
తిరుమల శ్రీవారికి 121 కేజీల స్వర్ణాభరణాలు కానుక గా ఓ ఎన్‌ఆర్‌ఐ భక్తుడు స్వామివారికి వీటిని బహూకరించనున్నారు. ఈ విరాళానికి సంబంధించి చంద్రబాబు గతేడాది ప్రకటన చేసారు. కాగా, టీటీడీ అధికారులు, అర్చకులు, బొక్కసం అధికారుల సూచనల మేరకు శ్రీవారికి శిరస్సు నుంచి పాదాల వరకు అలంకరించేలా కిరీటం, శంఖుచక్రాలు, కటి వరద హస్తాలు, వడ్డాణం, పాదుకలు ఇలా దాదాపు 45 రకాల ఆభరణాలను ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా దాత తయారు చేయించారు. ఇప్పటికే ఇవి తిరుమలకి చేరుకున్నాయి. ఈ ఆభరణాల ప్రదర్శన కోసం శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో చెక్కలతో వేదికను రాత్రి సిద్ధం చేశారు. కాగా, సీఎం చంద్రబాబు ఉదయం 10.45 గంటలకు తిరుమలలోని గాయత్రి అతిథి గృహానికి చేరుకుని సంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సీఎం సమక్షంలో దాత స్వర్ణాభరణాలను టీటీడీకి అందజేస్తారు.

టీటీడీ చరిత్రలో భారీ కానుక
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత చంద్రబాబు తిరిగి అతిథిగృహానికి చేరుకుంటారు. వైకుంఠ ద్వార దర్శనాలు, చేపట్టాల్సిన ఏర్పాట్లు, టికెట్ల కేటాయింపు వంటి వాటిపై కొద్దిసేపు అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం బంగారు ఆభరణాల విరాళానికి సంబంధించిన వివరాలతో పాటు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను మీడియాకు వివరిస్తారు.తిరుమల శ్రీవారి గర్భాలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకరణకు ఇప్పటికే దాదాపు 650 కేజీల ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.6వేల కోట్లకు పైమాటే. వాటిలో పొదిగిన వజ్రాలు, రత్నాలు, కెంపులు కూడా కలిపితే వాటి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ పురాతన కాలం నుంచి ఒక్కొక్కటిగా శ్రీవారికి అందినవే. అయితే టీటీడీ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఒకేసారి ఒకే భక్తుడి నుంచి 121 కేజీల ఆభరణాల సెట్ కానుకగా అందడం మాత్రం ఇదే తొలిసారి. స్వామికి రత్నఖచిత, వజ్ర వైడూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలు ప్రతివారం అభిషేకం తరువాత అలంకరిస్తుంటారు.
శ్రీవారి నిత్యాభరణాలు
కాగా, నిత్యాభరణాలుగా పిలిచే వజ్రాల శంఖుచక్రాలు, రత్నాల శంఖుచక్రాలు, రత్నాల కర్ణపత్రాలు, రత్నాల మకరకంఠి, రత్నాల కటి హస్తం, రత్నాల వైకుంఠ హస్తం, స్వర్ణ పద్మపీఠం, స్వర్ణ పాదాలు, అష్టోత్తర శతనామ హారం, సమస్రనామం, సూర్య కఠారి, కడియాలు, కర భూషణాలు, భుజదండ భూషణాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, సాలిగ్రామ హారం, తిరుక్కాళం, ఆకాశరాజు కిరీటం, వజ్ర అశ్వత్థపత్ర హారం, ముఖ పట్టీ, ఐదు పేటల కంఠి, చంద్రవంక కంఠి, పాగడాలు, కాంచీగునం, అంకెలు, వడ్డాణాలు, గోపు హారం, స్వర్ణ యజ్ఞో పవీతం, తులసీ పత్రహారం, పులిగోరు హారం ఇలా చాలానే నిత్యాభరణాలుగా ఉన్నాయి. వీటిలో సహస్రనామ మాల, లక్ష్మీహారం, పచ్చ పొదిగిన కంఠాభరణం, వక్షస్థల లక్ష్మి, లక్ష్మీ హారాలు, సాలగ్రామ హారం శ్రీవారిపై ఉంటాయి. మిగిలిన ఆభరణాలు మూడు జతలకు పైగా ఉండటంతో టీటీడీ వాటిని అవసరాలకు అనుగుణంగా మార్పిడి చేస్తుంటుంది. తాజా విరాళంతో శ్రీవారి అలంకరణకు మరో సెట్ జత కానుందని అధికారులు వెల్లడించారు.














Click it and Unblock the Notifications
