బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తుఫాన్ గా మారే ఛాన్స్ - ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు.. వచ్చే నెల రెండో వారంలో వరుసగా ఏపీకి రెండు తుఫాన్లు పొంచి ఉన్నాయని ఇప్పటికే అధికారులు వెల్లడించారు. కాగా, దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ నెల 28 లేదా 29వ తేదీకల్లా ఉపరితల ఆవర్తనం ఆవరించనున్న దని వివరించారు. దీని ప్రభావంతో 30వ తేదీన అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుందని.. తుఫానుగా బలపడే అవకాశం ఉందని చెప్పారు. ఈ ప్రభావం పలు జిల్లాల పైన ఉంటుందని.. భారీ వర్షాలు కురుస్తాయని అప్రమత్తం చేసారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం బలపడే క్రమంలో పశ్చిమంగా పయనించి డిసెంబరు రెండు లేదా మూడో తేదీకల్లా వాయుగుండం/తుఫానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించిన అనంతరం శ్రీలంక, దక్షిణ తమిళనాడు వైపు రానున్నదాని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా , గల్ఫ్ ఆఫ్ మన్నార్ నుంచి తమిళనాడుకు ఆనుకుని నైరుతి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో సముద్రం నుంచి కోస్తా, రాయలసీమలపైకి తూర్పుగాలులు వీస్తుండ టంతో బుధవారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరుగా వర్షాలు, రెండు మూడుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మార్కా పురం జిల్లా పామూరులో 74.87, నెల్లూరు జిల్లా అల్లంపాడులో 55.5, గూడూరులో 51.25, తిరుపతి జిల్లా నాయుడుపేటలో 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

తుఫాను గా మారే అవకాశం
అదే విధంగా.. కోస్తా, సీమల్లో వచ్చే నెల ఒకటో తేదీ వరకు పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక.. తెలంగాణ రాష్ట్రంలోనూ అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయిని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే.. చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది.. రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణం ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications
