అచ్చంపేటలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన.. ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు అభివృద్ధి పనులు!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేడు నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించనున్నారు. జిల్లాలో రూ.450 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద ఒక కోటి మంది మహిళలకు ఉచిత చీరల పంపిణీని అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఇదే వేదికపై కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లను కూడా పంపిణీ చేస్తారు.మధ్యాహ్నం మూడు గంటలకు పదర మండలం మద్దిమడుగుకు హెలికాప్టర్‌లో చేరుకునే సీఎం, అక్కడ రూ.38 కోట్లతో ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్ భారీ విగ్రహం , రూ.18 కోట్లతో పబ్బతి ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధి పనులు, రూ.15 కోట్లతో ఆలయం సమీపంలో హరిత హోటల్ నిర్మాణం తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు.

స్థానికులకు ఆధ్యాత్మిక, పర్యాటక అవకాశాలు మెరుగుపడేలా ఈ పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.అనంతరం సీఎం అచ్చంపేటకు హెలికాప్టర్‌లో చేరుకుని, హెలిప్యాడ్ నుంచి పాదయాత్రగా బహిరంగ సభా ప్రాంగణానికి వెళ్తారు. అక్కడ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నాగర్‌కర్నూల్, పెద్దకొత్తపల్లి, వెల్దండలో రూ.29.65 కోట్లు, రూ.274.32 కోట్లతో జిల్లా వ్యాప్తంగా బీటీ రోడ్ల అభివృద్ధి, రూ.25 కోట్లతో అచ్చంపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు.
రూ.18.105 కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో 130 అదనపు తరగతి గదుల నిర్మాణం, రూ.16 కోట్లతో తాగునీటి సరఫరా మౌలిక సదుపాయాలు, రూ.14 కోట్లతో అమ్రాబాద్ మండలం మన్ననూరులో కొత్త ఐటీడీఏ భవనం, రూ.2 కోట్లతో అచ్చంపేటలో ఆదివాసీ భవనం తదితర పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ పనులు జిల్లా అభివృద్ధికి, విద్యా, రవాణా, తాగునీటి సౌకర్యాల మెరుగుదలకు దోహదపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఇందిరమ్మ ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రంలో రెండోసారి ఇందిరా మహిళా శక్తి పథకం కింద చీరలు పంపిణీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షలు మొత్తం ఒక కోటి మంది మహిళలకు చీరలు అందించనున్నారు. 95 లక్షల పాలిస్టర్ చీరలు, 5 లక్షల పాలీకాటన్ చీరలు సిద్ధం చేశారు.
ఆకర్షణీయమైన చిలక పచ్చ రంగులో ఆధునిక, సంప్రదాయ డిజైన్లతో ఈ చీరలు తయారు చేశారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలందరూ అర్హులు. ఆధార్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు చూపించి చీరలు తీసుకోవచ్చు. జిల్లా కలెక్టర్లు, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఈ పంపిణీ జరుగుతుంది. చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ మహిళలకు గిఫ్ట్‌గా ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.అదే సమయంలో చేయూత కొత్త పింఛన్లను కూడా పంపిణీ చేస్తారు. సభలో సీఎం ప్రజల సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడనున్నారు.














Click it and Unblock the Notifications
