శ్రీవారికి బంగారం కానుకలు:కేసీఆర్, మేకపాటి, రామలింగ రాజు సహా - ఎవరు ఏం ఇచ్చారంటే..!!
తిరుమల శ్రీవారికి బంగారు ఆభరణాలు ఎంతో కాలంగా విరాళం రూపంలో అందుతున్నాయి. తాజా గా వర్దమాన్ జైన్ 121 కిలోల బంగారం కానుకగా ఇవ్వటంతో భక్తుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కాగా, నాడు ఆకాశ రాజు నుంచే విరాళాలు అందుతున్నాయి. ఇప్పుడు వర్దమాన్ జైన్ ఇచ్చిందే అతి పెద్ద కానుక. పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం తిరుమలకు బంగారు ఆభరణాలు విరా ళంగా అందించారు. తాజాగా జైన్ విరాళం వేళ.. ఎవరు ఎంత మొత్తంలో విరాళంగా అందించారు అనేది చర్చగా మారింది.
తిరుమల శ్రీవారి గర్భాలయంలోని మూలవిరాట్టుతో పాటు ఉత్సవమూర్తుల అలంకరణకు ఇప్పటికే దాదాపు 650 కేజీల ఆభరణాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.6వేల కోట్లకు పైగా ఉంటుందని చెబుతారు. వాటిలో పొదిగిన వజ్రాలు, రత్నాలు, కెంపులు కూడా కలిపితే వాటి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఇవన్నీ పురాతన కాలం నుంచి ఒక్కొక్కటిగా శ్రీవారికి అందినవే. శ్రీనివాసుడికి తొలుత ఆకాశరాజు బంగారు కిరీటం చేయించాడని పురాణ కథనం. ఆ తర్వాత 12వ శతాబ్దం వరకు స్వర్ణాభరణాలు, వస్తువులు దఫాల వారీగా స్వామివారికి అందినా.. ఆ వివరాలు ఎక్కడా నమోదు కాలేదు. అయితే 12వ శతాబ్దం నుంచే స్వర్ణాభరణాలు భారీగా అందాయని శాసనాల ద్వారా తెలుస్తోంది. మొఘల్ చక్రవర్తులైన అక్బర్, జహంగీర్ ముద్రలతో 500 నాణేలతో ఉన్న దండతో పాటు కింగ్ జార్జ్, విక్టోరియా రాణి చిత్రం ఉన్న 492 నాణేలతో ఉన్న హారాలు స్వామికి కానుకగా అందాయి.

శ్రీవారికి ప్రముఖుల విరాళాలు
కాగా, శ్రీ వేంకటేశ్వర హేచరీస్ 13 కేజీల కిరీటం, సంజీవ్ గోయెంకా 10 కేజీల బంగారు కిరీటాలు బహూకరించారు. స్వామివారి సహస్రకలశాభిషేకంలో వాడే 108 బంగారు పుష్పాలను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ సమర్పించారు. రత్నాల కంఠి, వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్రాలు స్వామికి కానుకగా అందాయి. 2009 లో గాలి జనార్దనరెడ్డి రూ.42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని స్వామికి సమర్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ ప్రభుత్వం తరఫున రూ.5.2 కోట్ల విలువైన 19.072 కిలోల బరువున్న రెండు స్వర్ణాభరణాలు అందజేశారు. రామలింగరాజు ఇచ్చిన విరాళంతో రూ.11 కోట్ల వ్యయంతో నూతన సహస్రనామ కాసుల బంగారు హారాన్ని స్వామివారికి అందజేశారు. లలిత్ బాసిన్ బంగారు గంగాళం, పాత్రలు ఇచ్చారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమెహన్‌రెడ్డి 20 కేజీల మూలవర్ల బంగారు పీతాంభరాలు బహూకరించారు.
పారిశ్రామిక- రాజకీయ దిగ్గజాల కానుకలు
అదే విధంగా 2003లో 108 బంగారు పుష్పాలను లలిత జ్యూవెలరీ అధినేత కిరణ్ అందజేశారు. కాగా.. 2021లో ఎం అండ్ సీ ప్రాపర్టీస్ సంస్థ 3.604 కేజీల బంగారు బిస్కెట్లు విరాళంగా ఇచ్చింది. అదే ఏడాది ఓ ఆజ్ఞాత భక్తుడు 5.3 కిలోల బరువైన బంగారు కఠి, వరద హస్తాలను అందజేశారు. తమిళనాడుకు చెందిన తంగదొరై పలుమార్లు విలువైన బంగారు ఆభరణాలను సమర్పించారు. గతేడాది మే నెలలో సంజీవ్ గోయంకా బంగారు కఠి, వరద హస్తాలను కానుకగా ఇచ్చారు. ఇక.. ఇప్పుడు వర్దమాన్ జైన్ 121 కిలోల బంగారం తో శ్రీవారి నిత్యం అలంకరణ కోసం 46 రకాల స్వర్ణాభరాలను టీటీడీకి అందించారు.














Click it and Unblock the Notifications
