వైకుంఠ ద్వార దర్శనాల టికెట్లు, టోకెన్ల జారీ వివరాలు ప్రకటించిన టీటీడీ..!!
టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ సారి తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు సామాన్య భక్తుల కు ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయింది. టికెట్లు.. టోకెన్ల జారీ తేదీలతో పాటుగా టైమింగ్స్ ను వెల్లడించింది. స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల ఈ-డిప్ నమోదు కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. తొలి రెండు రోజుల్లో ప్రోటోకాల్ మినహా బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది.
వైకుంఠ ఏకాదశి వేళ శ్రీవారి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో, పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కొనసాగించాలని టీటీడీ నిర్ణయించింది. డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి వివిధ దర్శన టికెట్లు, టోకెన్ల విడుదల తేదీల వివరాల పైనా స్పష్టత ఇచ్చింది. అందులో భాగంగా నవంబర్ 28న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. నవంబర్ 30వ తేదీ ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల కానుంది. అదే విధంగా డిసెంబర్ 1 నుంచి 5వ తేదీ వరకు ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులకు సంబంధించిన స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కోసం భక్తులు ఈ-డిప్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ వెల్లడించింది.

సామాన్య భక్తులకు ప్రాధాన్యత
కాగా, డిసెంబర్ 7వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల కేటాయించనున్నారు. డిసెంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు దాతల దర్శన కోటా టికెట్ల విడుదల చేయనున్నారు. అయితే.. టీటీడీ నిర్ణయం మేరకు వైకుంఠ ఏకాదశి, ద్వాదశి తొలి రెండు రోజులైన డిసెంబర్ 20, 21 తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగింది. ఈ రెండు రోజుల్లో అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను ఈ-డిప్ విధానం ద్వారా ఆన్లైన్లో కేటాయించనున్నారు. అలాగే, ఈ రెండు రోజులకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. కాగా.. భక్తులు దర్శన టికెట్లు, టోకెన్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని టీటీడీ సూచిస్తోంది. వైకుంఠ దర్శనాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ముందస్తు చర్యల పైన టీటీడీ తుది కసరత్తు చేస్తోంది.












Click it and Unblock the Notifications
