రుషికొండ భవనాల పై ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం- అక్కడే, ఇక నుంచి..!!
ఏపీ కేబినెట్ రుషికొండ భవనాల పైన అనూహ్య నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ భవనాల వినియోగం పైన అనేక చర్చలు చేసింది. కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. కాగా, ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు.. ప్రభుత్వ ప్రోత్సాహకాలతో పాటుగా అమరావతి లో నిర్మాణాల పైనా పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసారు.
ఏపీ కేబినెట్ లో రుషికొండ ప్యాలెస్‌పై కేబినెట్లో కీలక చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ భవనాల వినియోగం పైన పలు సిఫారసులు చేసింది. ఇప్పటికే ఆతిథ్య రంగానికి చెందిన నిపుణులతోనూ చర్చించారు. కాగా. ఈ రోజు జరిగిన సమావేశం లో నాలుగు నెలల పాటు ప్రజల సందర్శన కోసం రుషికొండ ప్యాలెస్‌ను తెరవాలని నిర్ణయం తీసుకున్నారు. సందర్శనకు టికెట్ విధానంపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. అదే విధంగా రానున్న 120 రోజుల్లో ఆతిథ్య ప్రాజెక్ట్ కు PPP పద్ధతిలో అప్పగించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు పైన టాటా, లీలా ప్యాలెస్, అట్మాస్ఫియర్ కోర్ వంటి 9 సంస్థలు ఆసక్తితో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 2019 CRZ నిబంధనల మేరకు సడలింపు మేరకు మరో 4 ఎకరాల స్థలంలో కొత్త నిర్మాణాలకు అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ద్వారా మరో 150 గదుల వరకు నిర్మించుకునే అవకాశం కలుగుతుంది.

పలు కీలక నిర్ణయాలకు ఆమోదం
ఇక, ఇదే సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి, రాజధాని నిర్మాణం, విద్యుత్ ఉత్పత్తి, భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. పరిశ్రమల ఏర్పాటులో అనుమతుల జాప్యాన్ని నివారించేందుకు రూపొందించిన ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇటీవల జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సంస్థల ద్వారా రాష్ట్రానికి సుమారు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు రానుండగా, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పెనుకొండలో రూ.19 వేల కోట్ల పెట్టుబడి తో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటు, శ్రీకాకుళంలో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్, అచ్యుతాపురంలో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో సమీకృత సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయాన్ని రూ.6,641 కోట్లకు పెంచేందుకు ఆమోదం తెలిపింది.













Click it and Unblock the Notifications
