జగన్ సొంతూరిలో వైసీపీ ఓటమి వెనుక ? సాయిరెడ్డి షాకింగ్ రీజన్ ..!
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్ని సీరియస్ గా తీసుకున్నారు. అధికార కూటమి నుంచి ఎంత ప్రతిఘటన ఎదురైనా తట్టుకుని నిలబడాలని తమ నేతలు, క్యాడర్ కు చెప్పారు. దీంతో వారు కూడా ప్రాణాలకు తెగించి పలు చోట్ల ఎన్నికల్లో పోరాడటమే కాకుండా సంచలన విజయాలు కూడా సాధించారు. కానీ అనూహ్యంగా కడప జిల్లా పులివెందు నియోజకవర్గంలోని జగన్ సొంతూరు బలపనూరులో మాత్రం వైఎస్సార్సీపీ అభ్యర్ధిని టీడీపీ ఓడించింది. ఈ ఫలితంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
దీంతో రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన జగన్.. తన సొంతూరిని మర్చిపోయారా అన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైఎస్ కుటుంబ అడ్డాగా చెప్పుకునే రాజశేఖర్ రెడ్డి, జగన్ ల సొంతూరు బలపనూరులో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమి పాలవ్వడంపై పీఆర్బీ అధ్యక్షుడు విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) స్పందించారు. అంతే కాదు ఈ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి గల కారణాలను కూడా సాయిరెడ్డి పరోక్షంగా బయటపెట్టారు. దీంతో ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశమవుతోంది.

ఇందులో విజయసాయిరెడ్డి.. బలపనూరు పంచాయతీ సర్పంచ్ ఎన్నిక, టీడీపీ మద్దతుదారుడికి ఏకగ్రీవంగా దక్కిందంటే.. దీని అర్థమేమిటి? 4 దశాబ్దాల తర్వాత, వైఎస్ స్వగ్రామంలో టీడీపీ జెండా ఎగిరిందంటే- టీడీపీ దౌర్జన్యంగా అధికార దుర్వినియోగం చేసి వైసీపీ మద్దతుదారులను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకున్నదా? అని ప్రశ్నించారు. అలాగే ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే సహించేది లేదని ఒకవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ గారు చెప్తుంటే, పార్టీలో పెత్తనం చేస్తోన్న కోటరీ అనే దొంగలముఠా టీడీపీతో కుమ్మక్కై స్వార్థంతో అమ్ముడుపోవడం వల్ల ఇలా జరిగిందా! అని ఓ కీలక ప్రశ్న సంధించారు. వైసీపీ అధ్యక్షుడి సొంతూరులోనే కూటమి దౌర్జన్యాలను, అకృత్యాలను అడ్డుకోలేకపోతే, ప్రజాస్వామ్యాన్ని కాపాడలేకపోతే ఎలా..!? అంటూ జగన్ ను ఆయన ప్రశ్నించారు. తద్వారా వైసీపీ నాయకులు టీడీపీతో కుమ్మక్కుకావడం వల్లే ఇక్కడ జగన్ పార్టీ ఓడిపోయినట్లు చెప్పకనే చెప్పారు.













Click it and Unblock the Notifications
