రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్.. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయం వదిలేస్తానంటూ..
వరంగల్ లో నిర్వహించిన బీఆర్ఎస్ జనచైతన్య బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. మహిళలను కోటీశ్వరులను చేస్తామని హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు. కనీసం లక్షాధికారులను చేయండని.. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే రాజకీయం వదిలేస్తానని కేటీఆర్ సవాల్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. అంతేకాక మరో 500 రోజుల్లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు 2028లో కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని జోస్యం తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు దిల్లీ పెద్దలకు గులాంములుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ నేతలు అమిత్ షా కాళ్లు మొక్కుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఆయనపై బూతులు మాట్లాడటం తప్ప అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. ఈ మేరకు రేవంత్ రెడ్డివి తుగ్లక్ ఆలోచనలని తీవ్ర విమర్శలు చేశారు.
దేశంలోనే అతిపెద్ద ఆస్పత్రిని వరంగల్ లో కేసీఆర్ నిర్మించారని.. ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి వరంగల్ లో ఆస్పత్రిని ప్రారంభించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వరంగల్ నగరానికి చేసిందేమీ లేదని, ఒక్క పరిశ్రమనైనా తీసుకొచ్చారా..? అని ప్రశ్నించారు. వరంగల్ ఐటీ రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీసిందని ఆరోపించారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా ప్రస్తుతం పర్సంటేజీల పాలన సాగుతోందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే వరంగల్ జిల్లాలో త్వరలో బీఆర్ఎస్ లో భారీగా చేరికలు ఉంటాయని కేటీఆర్ తెలిపారు.












Click it and Unblock the Notifications
